హైడ్రా మరోసారి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందా.. అంటే అవుననే అంటున్నారు సియేట్ కాలనీ వాసులు. తమ భూముల్లోకి రావద్దంటూ హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ సున్నంచెరువుగా తమ ప్లాట్లను మార్చడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. మాదాపూర్లోని గుట్టలబేగంపేటకు చెందిన సర్వేనెంబర్లు 12,13లలో ఉన్న భూమి తమదేనంటూ సియేట్కాలనీ వాసులు గత రెండుసంవత్సరాలుగా హైకోర్టులో హైడ్రాపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసంవత్సరం జనవరిలో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఉత్తర్వులే మనుగడలో ఉంటాయని చెప్పిందని సియేట్కాలనీ వాసులు చెప్పారు.
– సిటీబ్యూరో/మాదాపూర్, ఆగస్ట్ 22 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో/మాదాపూర్, ఆగస్ట్ 22 (నమస్తే తెలంగాణ): శనివారం సున్నంచెరువు ప్రాంతంలో హైడ్రా చెరువుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ చేస్తూ అభివృద్ధి చేసినట్లు ప్రకటించుకుంటున్న వ్యవహారంపై సియేట్కాలనీ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు జరిగిన వాదనలలో హైడ్రా సున్నంచెరువు ప్రాంతంలో ఉన్న డెబ్రిస్తో పాటు ఇతర పనులు చేసుకోవచ్చు కానీ సియేట్కాలనీ వాసుల సర్వేనెంబర్ 12,13లలోని ప్లాట్లలో ఎటువంటి చర్యలూ చేపట్టరాదని, నిర్మాణాలు చేయరాదని, తవ్వకాలు జరపవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చిందని సియేట్ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డా.సదానందం, నాగేంద్రకుమార్, శివశంకర్, రవికుమార్ తదితరులు చెప్పారు.
అయితే హైడ్రా మాత్రం హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎనిమిదినెలలుగా పనిచేస్తుండడాన్ని వారు తప్పుబట్టారు. తాము ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా సిబ్బంది వినడం లేదని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వారు పనులు చేస్తూనే మరోవైపు కోర్టుకు మాత్రం తమ ప్లాట్లలోకి రావడం లేదని చెబుతున్నారని, ఒక ప్రభుత్వసంస్థ ఇన్నిరకాలుగా అబద్దాలు ఆడడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.అక్కడ కొందరి వీడియోలను పోస్ట్ చేస్తుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెరువు చేసే క్రమంలో మేం కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను ఎలా లాక్కుంటారని, అభిప్రాయాలు చెప్పిన వారి ప్లాట్లు ఏవైనా పోయాయా అంటూ ప్రశ్నించారు.
హైడ్రా ఏర్పాటైన తర్వాత కూల్చేసిన నిర్మాణాల్లో సున్నం చెరువు పరిసరప్రాంతాల్లో ఉన్న బిల్డింగులు, పేదవారి గుడిసెలు కూడా ఉన్నాయి. 2024 సెప్టెంబర్లో సున్నంచెరువు పరిసరప్రాంతాల్లోని కొన్ని ప్లాట్లను, అక్కడ ఉన్న నిర్మాణాలను సున్నంచెరువులో కడుతున్నారంటూ సర్వేనెంబర్లు 12,13లలో ఉన్న ప్లాట్లను చూపిస్తూ కూల్చివేతలు చేపట్టింది. అసలు సున్నం చెరువు విస్తీర్ణంపై ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోవడం గమనార్హం. ఎన్జీటీకి ప్రభుత్వ ఇచ్చిన నివేదికలో ఒకలా, హైడ్రా ప్రాజెక్టులో మరోలా, రెవెన్యూలో ఇంకోవిధంగా చెరువు విస్తీర్ణంపై ఒక సరైన కొలత లేకపోయినప్పటికీ హైడ్రా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లను తీసుకుని చెరువు ఎఫ్టీఎల్, బఫర్ అంటూ లాక్కుందని వారు ఆరోపిస్తున్నారు.

తమ ప్లాట్లను స్వాధీనం చేసుకున్న హైడ్రాపై సియేట్ కాలనీ ప్రతినిధులు అక్కడ ఎలా కూల్చివేతలు చేపడ్తుందని, తమ కష్టార్జితాన్ని ఎలా లాక్కుంటుందంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు నడుస్తుండగానే హైడ్రా పలుమార్లు కోర్టు తీర్పుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు కాలనీ ప్రతినిధులు చెప్పారు. అయితే కోర్టుకు మాత్రం తాము ఆ ప్లాట్లలో పనులు చేయడం లేదని, కేవలం అల్లాపూర్వైపు ఉన్న చెరువులో డెబ్రిస్ తీసి చెరువును అభివృద్ధి చేస్తున్నామంటూ కోర్టుకు చెప్పి క్షేత్రస్థాయిలో మాత్రం మొత్తం ప్లాట్లను ఆక్రమించి బండ్ నిర్మాణం చేపట్టిందని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సున్నంచెరువు ప్రారంభోత్సవానికి సిద్ధ్దమైందంటూ చేసుకుంటున్న ప్రచారాన్ని వారు ఖండించారు.
మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతం కోర్టు ఉత్తర్వు రిజర్వులో ఉన్నప్పటికీ హైడ్రా కార్యకలాపాలు కొనసాగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సియేట్ సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సున్నం చెరువు పరిసర ప్రాంతం కోర్టు ఉత్తర్వు రిజర్వులో ఉన్నప్పటికీ హైడ్రా పనులు కొనసాగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కూలగొట్టి ఆ స్థానంలో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా అక్కడ చెరువును తవ్వి బండ్ కట్టి పెద్ద ఎత్తున శనివారం సున్నం చెరువు బాధితులు తమ ప్లాట్ల వద్ద ప్లకార్డులు పట్టుకుని హైడ్రా తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులో ఉన్నప్పటికీ హైడ్రా సిబ్బంది పనులు ఎలా చేస్తారని చెప్పారు.
మా హక్కులను, ప్రయోజనాలను గౌరవించాలని ప్లాట్ యాజమానులు కోరారు. ఇది వరకే ఉన్న ఆలయాన్ని కూల్చి ఆ స్థానంలో చిన్న ఆలయం నిర్మించాలనే ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లాట్ యజమానుల అభిప్రాయాలను తీసుకోకుండా ప్రస్తుత ఆలయాన్ని కూలగొట్టేందుకు చట్టపరమైన అనుమతులు ఎవరు ఇచ్చారన్నారు. సియేట్ సొసైటీ ప్లాట్ల పరిధిలోని భూమిని కలుపుకొని సున్నం చెరువు విస్తీర్ణాన్ని సుమారు 15.24 ఎకరాల నుంచి 32 ఎకరాలకు ఎలా పెంచారని, దీనికి గల ఆధారాలను బాధితులమైనా మాకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రెండు ఎకరాల స్థలం ఆలయానికి కేటాయించినట్లు చెబుతున్నారని, ఆ స్థలం ఎక్కడ ఉందో చూపించాలన్నారు. మా అభిప్రాయాన్ని తీసుకోకుండా ఆలయం పేరుతో సున్నం చెరువు ఓపెనింగ్ ప్రక్రియను చేపట్టే ప్రయత్నాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యుడు కార్తిక్, సియేట్కాలనీ వాసులు పాల్గొన్నారు.