Drunk And Drive | బంజారాహిల్స్, జనవరి 25: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడితో పాటు అతడి స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఏసీపీ హరిప్రసాద్, డీఐ వీరశంకర్ వివరాలను వెల్లడించారు. సిక్‌విలేజ్ సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన లింగాల తారక్‌రామ్(30) బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్న తారక్‌రామ్, అతడితో పాటు పనిచేస్తున్న ఏసురాజును మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తారక్‌రామ్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతుడి సోదరి చింతల లీలావతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. సికింద్రాబాద్ సమీపంలోని తుకారామ్గేట్లో ఉంటున్న కావూరి రుత్విక్‌రెడ్డి(21) మద్యం సేవించి కారు నడిపించి..జూబ్లీహిల్స్‌లో యాక్సిడెంట్ చేసినట్లు విచారణలో తేలింది. రుత్విక్‌రెడ్డికి ఓ సంస్థలో ఉద్యోగం రావడంతో ట్రీట్ ఇస్తానంటూ..మంగళవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో తన బావ కారులో స్నేహితులతో కలిసి బయలుదేరాడు. తనకు ఉద్యోగం వచ్చిన ఆఫీసు వద్దకు తీసుకెళ్లి చూపించాడు.
వివిధ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం.. ఇంటికి బయలుదేరాడు. దారిపొడువునా బీర్లు తాగడంతో మత్తులో ఉన్న రుత్విక్‌రెడ్డి..సుమారు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తూ.. ఉదయం 5 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని పెద్దమ్మ గుడి వద్ద బైక్‌ను ఢీకొట్టి పారిపోయాడు. అనంతరం రుత్విక్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి బాలానగర్ సమీపంలోని ఫిరోజ్‌గూడలో ఉంటున్న తన బంధువు గుడిమెట్ల సురేశ్‌రెడ్డి(27) ఇంటికి వెళ్లారు. జూబ్లీహిల్స్‌లో యాక్సిడెంట్ చేశామని, ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టామని చెప్పారు. దీంతో తమ కారును అక్కడే ఉంచాలని సురేశ్‌రెడ్డి సూచించాడు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఏం జరిగిందో చూద్దామని, చిన్న ప్రమాదమైతే గాయపడిన వారికి ట్రీట్మెంట్ ఇప్పిద్దామంటూ సురేశ్‌రెడ్డి చెప్పి.. వారిని తన కారులో ప్రమాదం జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడ భారీగా జనం గుమిగూడి ఉండడంతో పాటు ప్రమాదంలో తారక్‌రామ్ చనిపోయినట్లు తెలుసుకున్న రుత్విక్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జూబ్లీహిల్స్ నుంచి కారు వెళ్లిన రోడ్లపై సీసీ ఫుటేజీని సేకరించిన పోలీసులు నిందితులను గుర్తించారు. మద్యం మత్తులో కారు నడిపిన రుత్విక్రెడ్డితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ప్రోత్సహించిన అతడి స్నేహితులను కూడా నిందితులుగా చేర్చి వారిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.