వరదలు.. రోడ్డు, అగ్నిప్రమాదాలు..ప్రకృతి వైపరీత్యాలు.. విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు అన్నిశాఖల సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేయడంతోపాటు నేరాల కట్టడి కోసం అత్యాధునిక బాహుబలి వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏమూలకు ఏ ఘటన జరిగినా క్షణాల్లో తెలుసుకొని అప్రమత్తం చేసే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను సీఎం కేసీఆర్ ప్రారం భించారు. కేంద్రం పనితీరు, ఏర్పాట్లను పోలీసు అధికారులు సీఎంకు వివరించారు.
గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లోని నగర పోలీస్ కమిషన రేట్లో సీఎం సమక్షం లో బాధ్యతలు స్వీకరి స్తున్న సీపీ ఆనంద్. చిత్రంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ
సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): మంచి ఆశయాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే కానిదేమీలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిరూపించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ శాఖకు కావాల్సిన టెక్నాలజీ, వాహనాలను అందిస్తూ వెన్నుదన్నుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే యావత్ తెలంగాణకు రక్షణ కవచంలా పని చేసేలా 2015, నవంబరు 22న బంజారాహిల్స్ రోడ్డు నెం.12లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ), నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనాల (ట్విన్ టవర్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీసీని గురువారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భూమి పూజ నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జరిగిన విశేషాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై తయారు చేసిన వీడియోలను ప్రదర్శించారు.
సిటీ పోలీస్ కమిషనరేట్ కూడా అక్కడే
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలతో కూడిన ఈ టవర్స్‌లో ఐదు బ్లాక్‌లు ఉన్నాయి. అందులో 20 అంతస్తులున్న ‘ ఏ’ బ్లాక్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఉంటుంది. 18వ అంతస్తులో నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఉండగా, స్పెషల్ బ్రాంచ్, ఐటీ, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, సైబర్ విభాగాల కార్యాలయాలు ఈ టవర్లోనే ఉంటాయి. కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సీవీ ఆనంద్ పూజలు చేశారు. ముఖ్యమంత్రి ఈ భవనాలను ప్రారంభించిన తరువాత టవర్లోని కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీవీ ఆనంద్‌ను కూర్చొబెట్టి సీఎం అభినందించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ తదితరులు, పక్కన సీసీ కెమెరాల మానిటరింగ్ వింగ్
7వ అంతస్తులో ముఖ్యమంత్రి చాంబర్..
భవనంలోని 7వ అంతస్తులో ముఖ్యమంత్రి చాంబర్ ఉంది. ఈ చాంబర్లో సీఎం కేసీఆర్ కూర్చోగా, అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కేంద్రంలోని టెక్నాలజీ ప్యూజియన్ను సీఎం సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలు ఇక్కడున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలోని రహదారులు, నీటి ప్రాజెక్ట్‌లు, ఆలయాలు, ప్రధాన సంస్థలు ఇలా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. దీంతో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడి నుంచే పరిశీలించవచ్చు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఉండే సీసీ కెమెరాలు స్టేషన్లో ఉండే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు, స్టేషన్ నుంచి డీసీపీ, ఎస్పీ కార్యాలయాలలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. అక్కడి నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అందుబాటులో ఉంటాయి.
అన్ని శాఖలతో సమన్వయం
ఇక్కడ పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి సమన్వయం ఉంటుంది. అన్ని శాఖలకు సంబంధించిన డాటా అందుబాటులో ఉంటుంది. అత్యవసర సమయాలలో ఈ డాటా ఎంతో అవసరపడుతుంది. డయల్ 100, 112లు అనుసంధామైన ఉంటాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఫైర్ ఇలా ఆయా డిపార్టుమెంట్ల అవసరాలకు ఏదైనా సమాచారం కావాలంటే ఇక్కడి నుంచి లభిస్తోంది. అత్యవసర సమయాలలో ఆయా శాఖలకు కేటాయించిన చాంబర్లలో ఆయా విభాగాల అధికారులు ఉంటారు. అత్యవసరమైనప్పుడు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంలోని అన్ని విభాగాల అధికారులు ఇక్కడి నుంచే తగిన నిర్ణయాలు తీసుకొని వేగంగా ప్రజలకు సేవలు అందిస్తారు.
పోలీసింగ్ మ్యుజియం
స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం వచ్చిన తరువాత పోలీసింగ్‌లో వచ్చిన మార్పులకు సంబంధించిన ప్రదర్శన శాలను ఈ టవర్స్‌లో అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ మొదటి పోలీస్ కమిషనర్ రాజాబహుదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహంతో పాటు ఆనాడు వాటిని కమ్యూనికేషన్ వ్యవస్థ పరికరాలు, ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉంచారు.
నేర నివారణ-విశ్లేషణలు
నేరాలను నివారించేందుకు టెక్నాలజీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఒక వైపు, నేరాలు జరిగేందుకు కారణాలను విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. పోలీస్ సేవలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నేరాలను నివారిస్తూ సేవలు అందించేందుకు కమ్యూనిటీ పోలీసింగ్ సపోర్టు సెంటర్, ఇన్విస్టిగేషన్ సపోర్టు సెంటర్, ఫంక్షనల్ వర్టికల్స్ సపోర్టు సెంటర్, ప్రాసిక్యూషన్ సపోర్టు సెంటర్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ సపోర్టు సెంటర్, క్రైమ్ ప్రివెన్షన్ సపోర్టు సెంటర్, ట్రైనింగ్ అండ్ కాంపిటెన్సీ బిల్డింగ్ సపోర్టు సెంటర్, ఉమెన్ సేఫ్టీ సపోర్టు సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర పోలీస్‌కు సంబంధించిన సైబర్ సేఫ్టీ, డ్రగ్స్ అండ్ నార్కొటిక్స్ కంట్రోల్, ఇతర అర్గానైజ్డ్ క్రైమ్స్ అండ్ కంట్రోల్, ఎమెర్జెన్సీ రెస్సాన్స్ మేనేజ్మెంట్, సోషల్‌మీడియా మానిటరింగ్ అండ్ ఆపరేషన్స్, డేటా ఎనాలటిక్స్ అండ్ ప్రిడిక్టివ్ ఎనాలాసిస్, స్టేట్ హైవే అండ్ ట్రాఫిక్ మానిటరింగ్, పోలీస్ టెక్నాలజీ అండ్ ప్రాసెస్ డెవెలప్మెంట్ ఆపరేషన్ విభాగాలు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తాయి.
సీసీసీ ముఖ్యమంత్రి ఆలోచనే..
రాష్ట్రం ఏర్పడిన తరువాత శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి జరుగుతున్నదని, ప్రజలు సుఖ శాంతులతో ఉంటారని ముఖ్యమంత్రి అన్నారు. పోలీసు శాఖ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖలో మార్పులు తెచ్చి మాకు వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం పోలీస్‌శాఖకు బడ్జెట్‌ను కేటాయించారు. వాహనాలు ఇచ్చి, టెక్నాలజీకి తగిన నిధులు ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన ముందుచూపుతో హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అవసరమని గుర్తించి, రూపకల్పన చేసి, నేడు అందుబాటులోకి తీసుకొచ్చారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సృష్టి మన ముఖ్యమంత్రిదే. సీసీసీ అనేది సీఎం మాకు ఇచ్చిన వజ్రం లాంటి బహుమతి. నగర పోలీసుల తరపున మేం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
ప్రపంచానికే రోల్ మోడల్
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే కాదు, ప్రపంచానికే ఒక రోల్ మోడల్‌గా మారనుంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభమైంది. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. విపత్తుల సమయంలో అన్ని శాఖలతో కలిసి వేగంగా చర్యలు తీసుకొని సమన్వయంతో పనిచేస్తాయి. ఇది అన్ని విభాగాలకు ఉపయోగంగా ఉంటుంది.
– సోమేశ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ
సీసీసీకి గ్రీన్ సర్టిఫికెట్
పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు సంబంధించిన బ్రోచర్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి సీసీసీ నమూనా జ్ఞాపికను సీఎంకు బహుకరించారు. అనంతరం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి ఇచ్చిన గ్రీన్ సర్టిఫికెట్‌ను సీఎంతో ఆవిష్కరించారు. భవన నిర్మాణం, టెక్నాలజీ, అర్కిటెక్చర్, పోలీసు విధులలో సేవలు అందించిన ఆర్ అండ్ బీ, విద్యుత్, పోలీస్ తదితర శాఖల అధికారులకు మెమోంటోలు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఒకే రకమైన పోలీసులు సేవలు అందుతాయి. పోలీసులకు దర్యాప్తు, సేవలలో కావాల్సిన సపోర్టు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అందుతాయి.
కమ్యూనిటీ పోలీసింగ్ సపోర్టు సెంటర్: కమ్యూనిటీ పోలీసింగ్‌తో నేరాలను నివారించడానికి వీలవుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఉండే సెక్టార్ల వారీగా కమ్యూనిటీలు ఏర్పాటు చేసి, ఆయా కమ్యూనిటీల ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించడంలో పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తారు.
ఇన్వెస్టిగేషన్ సపోర్టు సెంటర్: కేసుల దర్యాప్తు నాణ్యంగా, పారదర్శకంగా ఉండాలి. నేరం చేసిన వారికి పక్కాగా శిక్షలు పడే విధంగా ఆధారాలు సేకరించాలి. ఇందుకు పకడ్బందీగా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు అధికారికి సందేహాలుంటే వారికి సపోర్టు చేసేందుకు ఈ సెంటర్ పని చేస్తుంది.
ఫంక్షన్ వర్టికల్స్ సపోర్టు సెంటర్: ప్రతి పోలీస్‌స్టేషన్‌లో పనులను 17 వర్టికల్స్ (విభాగాలు)గా విభజించారు. ఆయా విభాగాలకు ఒకో అధికారికి బాధ్యత ఇస్తారు. ఎవరి బాధ్యతలు వారు పక్కాగా చేయడం వల్ల కేసుల దర్యాప్తు వేగంగా జరగడంతో పాటు ప్రజలకు వేగంగా సేవలు అందుతాయి.
ప్రాసిక్యూషన్ సపోర్టు సెంటర్: కేసుల దర్యాప్తు చేయడం వద్ద నుంచి చార్జిషీట్ వేసి నిందితులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా పని చేస్తారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో దర్యాప్తు అధికారులకు ఇక్కడి నుంచి సపోర్టు అందుతుంది.
సిటిజన్ ఫీడ్ బ్యాక్ సపోర్టు సెంటర్: ప్రజలకు పోలీసుల సేవలు ఎలా అందుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రత్యేక విభాగం.
క్రైమ్ ప్రివెన్షన్ సపోర్టు సెంటర్: జరుగుతున్న నేరాలను విశ్లేషిస్తూ, నేరాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై క్షేత్ర స్థాయి పోలీసులకు ఇక్కడి నుంచి సపోర్టు ఉంటుంది.
ఉమెన్ సేఫ్టీ సపోర్టు సెంటర్: మహిళలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, మహిళా భద్రతపై ప్రత్యేక విభాగం నుంచి క్షేత్ర స్థాయి పోలీసులకు సపోర్టు ఉంటుంది.
ట్రైనింగ్ అండ్ కంపిటెన్సీ బిల్డింగ్ సపోర్టు: నేరాలలో వస్తున్న మార్పులు, టెక్నాలజీపై పట్టును సాధిస్తూ ఎప్పటికప్పుడు పోలీసులు తమ శిక్షణలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. అందుకే శిక్షణ ఇస్తూ సిబ్బందిని అప్డేట్ చేసేందుకు ఒక విభాగం.
సైబర్ సేఫ్టీ: సైబర్ నేరాలను తగ్గించడం, సైబర్ సెఫ్టీపై ఈ ప్రత్యేక విభాగం పని చేస్తుంది.
డ్రగ్స్ అండ్ నార్కొటిక్స్ కంట్రోల్: డ్రగ్స్‌ను ఎక్కడికక్కడే కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా ఉంచే వ్యవస్థ ఇక్కడ ఉంటుంది.
నేరాలు, నియంత్రణ: వ్యవస్థీకృత నేరాలను కట్టడి చేయడంపై ఈ విభాగం దృష్టి పెడుతుంది.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్: ప్రజలకు అత్యవసర సేవలు అందించే ప్రత్యేక విభాగం ఇది. డయల్ 100, 112కు ఫోన్ చేసే వారికి ఇక్కడి నుంచి సేవలు అందుతాయి.
సోషల్‌మీడియా మానిటరింగ్ అండ్ ఆపరేషన్స్: సోషల్ మీడియాలో అసత్య, పుకార్లను నియంత్రిస్తూ ఈ ప్రత్యేక విభాగం పని చేస్తుంది.
డేటా అనాలసిస్ అండ్ ప్రిడెక్టివ్ అనాలసిస్: గతంలో జరిగిన ఘటనలు విశ్లేషిస్తూ, భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా వివిధ మార్గాల నుంచి తీసుకున్న డేటాను విశ్లేషిస్తూ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు.
స్టేట్ హైవేస్ అండ్ ట్రాఫిక్ మానిటరింగ్: ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మానిటరింగ్ కొనసాగుతుంది.
పోలీస్ టెక్నాలజీ అండ్ ప్రాసెస్ డెవెలప్మెంట్ వింగ్: రోజు రోజుకు టెక్నాలజీ అప్డేట్ చేసుకోవడం, పోలీసింగ్‌లో టెక్నాలజీ ఒక భాగంగా ఉంటుంది.
ఇంక్యూబేషన్ సెంటర్: పోలీస్ టెక్నాలజీపై వినూత్న ఆలోచనతో వచ్చే సాంకేతిక నిపుణులను పోలీస్ శాఖ ప్రొత్సహిస్తుంది. ఇందుకోసం సీసీసీలో ఇంక్యూబేషన్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.