చర్లపల్లి, జూలై 20: కేంద్ర కారాగారం అంటే శిక్షించే సంస్థ కాదని, శిక్షణ ఇచ్చే సంస్థగా గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఆదివారం ప్రొఫెసర్ రామిరెడ్డి మెమోరియల్ యాక్టివిటీస్‌లో భాగంగ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఖైదీల కోసం లీగల్ రైట్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంశంపై అవగాహన కారక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విద్య అందరికి అవసరమని, సమాజ అభివృద్ధి కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు. కేంద్ర కారాగరంలో శిక్ష అనుభవించే ఖైదీలకు విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఖైదీలు విద్యను అందిపుచ్చుకోవాలి..
అకాడమీ డైరక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను ఖైదీలు సరిదిద్దుకొని విద్యను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇక్కడ నేర్చుకున్న విద్య జైలు జీవితం అనంతరం ఖైదీలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేస్తుందని, ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
అనంతరం ప్రొఫెసర్ బీనా చింతలపూరి కుటుంబం మానవ విలువలపై అవగాహన కల్పించగా ప్రొఫెసర్ మురళీకృష్ణ న్యాయం పొందే హక్కులపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రొఫెసర్ సుధారాణి ఖైదీల న్యాయమైన హక్కులు, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు కాళిదాస్, శశికాంత్, రామయ్య, జైలర్ జ్యోతిర్మయిరెడ్డితో పాటు డిప్యూటీ జైలర్లు, వార్డెన్లు, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.