కొండాపూర్, సెప్టెంబర్ 21 : మాదాపూర్ సర్కిల్ పరిధిలోని సిద్ధిక్‌నగర్‌లో డ్రైనేజీ సమస్య రోజురోజుకూ తీవ్రతరం అవుతుంది. మ్యాన్‌హోల్స్ నుంచి మురుగు నీరు పొంగిపొర్లడంతో రోడ్లపైకి చేరుతుంది. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు రోడ్లపై నిలిచిన మురుగు నీటిని దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్ధితి నెలకొంది.
అక్రమ నిర్మాణాలతో సమస్య మరింత జఠిలం..
సిద్దిక్‌నగర్ ఐటీ కారిడార్ అతి చేరువలో ఉండడం, హాస్టళ్లకు మంచి ప్రాంతంగా మారడంతో ఇదే అదనుగా భావించిన కొంతమంది అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలతో విపరీతంగా నీటి వినియోగం పెరిగిపోతుంది. దీంతో గతంలోని డ్రైనేజీ లైన్ల పరిమాణం సరిపడక మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, మ్యాన్‌హోల్స్ నుంచి రోడ్లపైకి పొంగుతుంది. ఇప్పటికే జనసాంద్రత పెరగడంతో డ్రైనేజీ వ్యవస్థపై భారం పెరిగిందని, దీనికి తోడు అక్రమ నిర్మాణాలు, ఇరుకైన రహదారులతో సమస్య మరింత జఠిలమవుతోంది. వర్షం పడిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల పాట్లు..
రోడ్లపై మురుగు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, వృద్ధులు, మహిళలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో మురుగు నీరు పాదచారులపై పడటంతో ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీ దుర్వాసనతో పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో పాటు దోమల బెడద పెరిగిపోతుంది.
ట్రాఫిక్ సమస్య కూడా..
డ్రైనేజీ సమస్యకు తోడు రహదారులపై అక్రమంగా నిర్మాణాలు, నిర్మాణ మెటీరియల్స్ రోడ్లపై వేస్తుండడం, ఆక్రమణలు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లు ఇరుకుగా మారడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్రైనేజీ మార్గాలను గుర్తించి పూడికతీత చేపట్టడంతోపాటు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
అధికారులు స్పందించాలి..
సిద్దిక్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చోట్ల కొత్త పైపులైన్లు, కాలువల నిర్మాణం చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, డ్రైనేజీ మార్గాల ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. సమస్యను ఇకనైనా అధికారులు సీరియస్ గా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.