“ఆమె పేరు స్వప్న. ఐటీ ఉద్యోగి. ఆఫీసుకు సెలవు పెట్టి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరవడానికి మేడ్చల్ కార్యాలయానికి వెళ్లింది. పరీక్షకు ముందు సంబంధిత వివరాల నమోదులో ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆమె మొబైల్‌కు ఓటీపీ రాలేదు. దీంతో ఆమెను ఓటీపీ రాలేదని డ్రైవింగ్ టెస్ట్‌కు నిరాకరించారు. ఇందులో తన తప్పేముందని ఆమె ప్రశ్నించగా మళ్లీ ఓటీపీకి ప్రయత్నించారు. గంట సమయం తర్వాత ఓటీపీ వచ్చింది. ఈ క్రమంలో మరో ఓటీపీ సంబంధిత అధికారికి రావాల్సి ఉంటుంది. కానీ ఆ ఓటీపీ కూడా రాలేదు. దీంతో ఆమె పరీక్ష లింక్ ఓపెన్ కాలేదు. చేసేదేమి లేక మరో రోజు స్లాట్ రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఆవేదనతో వెనుదిరిగింది. ఇలా ఆమె సెలవును ఓటీపీలు నిరూపయోగంగా మార్చేశాయి. ఇది కేవలం స్వప్న సమస్య మాత్రమే కాదు.. నగరంలో లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్న మెజార్టీ వాహనదారుల పరిస్థితి ఇలాగే తయారయ్యింది”.
సిటీబ్యూరో, జూన్ 19 ( నమస్తే తెలంగాణ ) :బండి నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కీలకం. అందుకోసం శిక్షణ పొంది తొలుత లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరై సర్టిఫికెట్ పొందుతాం. అది 6నెలల గడువు ఉంటుంది. నెలరోజుల అనంతరం మనకు వీలైన రోజు స్లాట్ బుక్ చేసుకొని డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరవుతాం. ఈ ప్రక్రియలో వాహనదారుడు టెన్షన్ పడటం సాధారణమే. కానీ ఇప్పుడు కేంద్ర సర్వర్ సాంకేతిక సమస్య వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. లెర్నింగ్ పరీక్షకు హాజరవడానికి కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుదారులకు టెక్నికల్ సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఓటీపీలు రాక నాగోల్, ఉప్పల్, మేడ్చల్, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, మలక్‌పేట తదితర ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుదారుల్లో చాలా మంది వెనుతిరుగుతున్నారు. ఈ పక్రియలో ఎలాగోఅలా కొందరు గట్టెక్కినా మళ్లీ ట్రాక్‌లో బండి నడపే పరీక్ష కూడా సవాల్‌గానే మారింది. కౌంటర్లో ఫైల్ అప్రూవల్ అయ్యాక ట్రాక్‌లో బండి నడపాల్సి ఉంటుంది. అలా నడిపాక ఆ వాహనదారుడి లైసెన్స్ అప్రూవల్ చేయాలంటే అధికారులకు సర్వర్ సమస్య తలనొప్పిగా మారింది. డ్రైవింగ్ టెస్ట్ పూర్తయ్యాక కూడా లైసెన్స్‌లను అధికారులు అప్రూవల్ చేయలేకపోతున్నారు. ఇలా నగరంలో కేవలం మూడురోజుల్లో 1,700 మంది లైసెన్స్‌లు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
సారథి పోర్టల్ కొన్ని రోజులుగా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అధికారులు పోర్టల్ సేవలు మెరుగయ్యే వరకు సేవలు రద్దు చేయకుండా… రోజులో కొన్ని గంటలు పనిచేస్తూ ఉండటంతో అందరూ స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారు. తీరా ఆ రోజు కార్యాలయాలనికి వెళ్తే సర్వర్ సమస్య ఉందని సేవలు నిలిపివేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, పోర్టల్ హ్యాక్ అయిందని అధికారులు చెబుతున్నారు. వివిధ రకాల సేవల లింక్‌లు అన్ని ఎగిరిపోతున్నాయని తెలిపారు. ఫైల్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేశాక ఓకే చేయలేకపోతున్నామని ఈ క్రమంలో ఫైల్ ఎగిరిపోతుందని చెప్పారు. ఇంకా పోర్టల్ పనితీరు మెరుగవకపోవడంతో వాహనదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్ బాగయ్యే వరకు ఆర్టీఏ సేవలను నిలిపివేయాలని, తమను పరేషాన్ చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు.