హిమాయత్‌నగర్, ఏప్రిల్ 14 : ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రోహిత్ రుద్రాంగిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.50వేల నగదుతోపాటు ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌లో నివాసం ఉండే బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రోహిత్ రుద్రాంగి ముంబైకి చెందిన బుకీలు ఇచ్చిన రాధేఎక్స్చ్ అనే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు యాప్‌లో అగర్వాల్ అనే వ్యక్తితో కలిసి బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడు. హైదర్‌గూడలోని పెట్రోల్ బంక్ సమీపంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా.. రోహిత్ రుద్రాంగి డబ్బుతో పట్టుబడగా, మరో వ్యక్తి అగర్వాల్ పరారయ్యాడు. ఆన్లైన్లో రూ.లక్ష పంపినట్లు పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీసులకు అప్పగించినట్లు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు.