Hyderabad | శేరిలింగంపల్లి, ఆగస్టు 22: హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాజాగూడలో శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ముగ్గురు యువకులు విట్పిలెన్ మోటార్‌సైకిల్‌పై ఖాజాగూడ నుంచి అంజయ్యనగర్ వైపు వెళ్తున్నారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సమీపంలో ఈఎస్ఐ రెండో గేటు నుంచి కేర్ ఆస్పత్రి మెయిన్ రోడ్డుకు కుడివైపు మలుపు తిరుగుతున్న సమయంలో అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పింది.
ఈ ప్రమాదంలో వెనుక కూర్చొన్న అబ్బాస్ సిద్ధిఖ్ (25) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్ నడుపుతున్న సహస్ర చటోపాధ్యాయ్ (25), మధ్యలో కూర్చొన్న అభిజిత్ సింగ్ (25) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.