Metro Train | మేడ్చల్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): నార్త్ సిటీ (ఉత్తర నగరం) ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. నార్త్ సిటీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నార్త్ సిటీకి మెట్రోను విస్తరించాలన్ని ప్రజల నుంచి పలుమార్లు డిమాండ్లు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరానికి నలువైపులా మెట్రో విస్తరణ, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారు. ఉత్తరం వైపున కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాలతో పాటు తూము కుంట, శామీర్‌పేట్ ప్రాంతాలకు మెట్రో విస్తరణపై సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మెట్రో విస్తరణ పనులను పక్కన పెట్టారు. నార్త్ సిటీ ఉత్తర తెలంగాణకు నగరానికి కనెక్టివిటిగా ఉన్న జాతీయ రహదారి 44 మేడ్చల్ ప్రాంతం మీదుగా ప్రతిరోజు నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు వేలాది సంఖ్యలో తిరుగుతుంటారు. మేడ్చల్‌కు మెట్రోను విస్తరిస్తే నార్త్ సిటీ మరింత అభివృద్ధి జరిగి ప్రజలకు సౌకర్యవంతంగా మారనుంది. మేడ్చల్ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు, వివిధ రకాల కంపెనీలు ఉన్న దృష్ట్యా మెట్రో విస్తరణ జరిగితే వేలాది మంది ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్థులు కార్మికులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ మెట్రో విస్తరణ ప్రాజెక్ట్ చేపడితే మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్‌తో అనుసంధానించబడి ఉంటాయి.
విస్తరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం: మెట్రో సాధన సమితి
మేడ్చల్ ప్రాంతానికి మెట్రోను విస్తరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మెట్రో సాధన సమితి సభ్యులు హెచ్చరిస్తున్నారు. మెట్రో విస్తరణపై పలు దఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినా, ఇప్పటి వరకు మెట్రో విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, నార్త్ సిటీ అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరిస్తున్న తీరు కనపడుతోందని మెట్రో సాధన సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. మెట్రో పనులు విస్మరించడంపై అవసరమైతే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాం. మేడ్చల్ ప్రాంతానికి న్యాయ బద్దంగా రావాల్సిన మేడ్చల్ మెట్రోను సాధించి తీరుతామని హెచ్చరిస్తూ మెట్రో సాధనకు ఉద్యమించేందుకు త్వరలోనే ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామంటున్నారు. అభివృద్ధి జరిగిన మేడ్చల్ ప్రాంతానికి మెట్రోను విస్తరించకుండా ఫోర్త్ సిటీ పేరుతో ఊహల నగరంగా సృష్టించి, లేని నగరానికి మెట్రో విస్తరణ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
మెట్రో సాధించి తీరుతాం
మేడ్చల్ ప్రాంతానికి మెట్రోను సాధించి తీరుతాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదారబాద్ నగరానికి నలు వైపులా అభివృద్ధి చేసింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మెట్రో ప్రాజెక్టును నార్త్ సిటీ అయిన మేడ్చల్, కొంపల్లి, తూంకుంట, శామీర్‌పేట్ ప్రాంతాలకు విస్తరించేలా సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులకు అప్పగించింది. అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను విస్మరించింది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసం ఉండాలె.. కానీ, స్వార్థ రాజకీయాలు, ప్రయోజనాల కోసం కాదు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ భూములను పోగు చేసి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. తన లాభం కోసం మేడ్చల్ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేడ్చల్ ప్రాంత అభివృద్ధితో పాటు వేలాది మందికి రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు మెట్రో సాధించేలా ఉద్యమం చేస్తాం.
– కేపీ వివేకానంద్ గౌడ్, ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం;