సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వీధి దీపాల నిర్వహణ విషయంలో అధికారులు ఆలసత్వాన్ని వీడారు. నూతన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతుండడం, సదరు ఏజెన్సీ ఈఈఎస్ఎల్పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి… గడువు ముగిసినా.. ముందస్తు ప్రణాళిక కొరవడిన ఫలితంగా వీధి దీపాల సమస్యలపై అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు పెరిగాయి.
అంతేకాకుండా ఈ నెల 24న వీధి లైట్ల సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ )సుమోటాగా తీసుకుని పురపాలక శాఖను వచ్చే జూన్ 4వ తేదీలోగా నివేదిక కోరిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే ప్రస్తుత నిర్వహణలో ఉన్న ఈఈఎస్ఎల్ ఏజెన్సీ గడువును మరో రెండు నెలల పాటు పొడగించి, ఈ లోగా నూతన పాలసీని తీసుకురావాలని నిర్ణయించారు.
రెండు నెలల నిర్వహణలో భాగంగా ఒక్కో లైట్‌కు రూ. 18-22ల వరకు సదరు ఏజెన్సీ ఇవ్వాలని, 5.40 లక్షల లైట్లకు గానూ రూ.18ల చొప్పున నెలకు రూ.98 లక్షలు అవుతుందని, దాదాపు రెండు కోట్ల రూపాయలు సదరు ఏజెన్సీ చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, భువనేశ్వర్, సూరత్ నగరాల్లో వీధి లైట్ల నిర్వహణకు ఇండ్యూడవల్ లైట్ మానిటరింగ్ (ఐఎల్ఎం) విధానాన్ని అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతో పాటు నివేదిక తయారు చేయాలని నిర్ణయించారు.
పాత విధానంలో విద్యుత్ దుర్వినియోగంతో పాటు బిల్లుల చెల్లింపులోనూ అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. వీటన్నింటికీ చెక్ పెట్టాలని భావించి తెరపైకి కొత్త పాలసీ వైపు అడుగులు వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో వీధి దీపాల లెక్కలపై సర్వే జరుపుతున్నారు. స్తంభాలు, లైట్లు ఎన్ని ఉన్నాయి? అనే లెక్క తేల్చడానికి స్ట్రీట్ లెవల్ నిర్వహణ సిస్టమ్ యాప్ ద్వారా సర్వే చేపడుతున్నారు.
విద్యుత్ మీటర్లు, సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ప్యానల్స్, లైట్లు, పోల్స్ వంటి అన్ని ఆస్తుల వివరాలను నమోదు చేసి వాటి పనితీరును ట్రాక్ చేస్తున్నారు. ఎక్కడైనా వీధి దీపాలు పనిచేయకపోతే ఆ సమస్యను తక్షణమే గుర్తించి వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను తయారు చేస్తున్నారు. కొత్త విధానంలో ఎంత విద్యుత్ వినియోగిస్తే అంతే బిల్లు చెల్లించేలా మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. నూతన పాలసీకి సంబంధించి నివేదికను రూపొందించి త్వరలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన తర్వాత టెండర్లు పిలిచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.