బ్రేకులు ఉండవు.. కాళ్లతోనే ఆపాలి..
బరువు తక్కువ.. వేగం ఎక్కువ
కార్బన్ ఫైబర్‌తో తయారీ
లక్షలు విలువ చేసే బైస్కిల్స్కు యమ క్రేజ్
6.8 కేజీల బరువుకు తగ్గకుండా ట్రాక్ సైకిళ్లు
వెలోడ్రమ్ స్టేడియంలో జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్
ముగిసిన పోటీలు.. హైదరాబాద్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్లేయర్లు
సైకిల్ కోసం ఒకప్పుడు రూ.1,200 నుంచి 2 వేలు పెట్టేవారు. ఆ తర్వాత మంచి కంపెనీ సైకిళ్ల ధరలు 15 వేల వరకు ఉన్నాయి. గతంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో హీరోతో కనిపించిన సైకిల్ ధర రూ.3.5 లక్షలు అంటే అందరూ ‘అమ్మో.. అంతరేటా’ అని అనుకున్నారు. అయితే సైకిళ్ల ధరలు రూ.1.6 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇలా ఖరీదైన విభిన్నమైన సైకిళ్లకు ఓయూ వెలోడ్రమ్ స్టేడియం వేదికైంది. చూడటానికి సాదాసీదాగా కనిపించినా.. వాటి వినియోగం అమోఘం. మొత్తంగా సుమారు కోటి రూపాయలకు పైగా విలువజేసే 540 విభిన్న రకాల బైస్కిల్స్ 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్-2021 పోటీల్లో ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో జరిగిన ఈ ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో 27 రాష్ర్టాల చాంపియన్స్ పాల్గొని సత్తాచాటారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్ జరుగడం ఇదే మొదటిసారి. దేశంలో ఓయూ వెలోడ్రమ్ స్టేడియమే నంబర్ వన్. ఔట్‌డోర్‌లో ఫాస్టెస్ట్ స్టేడియం ఇదే. సైక్లింగ్ చేయడం చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కొంతమంది సీరియస్‌గా తీసుకుని పోటీల వరకు వస్తారు. మేము రైల్వే ఉద్యోగులకు శిక్షణ ఇస్తాం. సుమారు 6 వందల మంది ప్లేయర్లు పా
ల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ పోటీలను విజయవంతంగా పూర్తి చేశాం. -సాయికృష్ణ, కోచ్, ఇండియన్ రైల్వే సైక్లింగ్ టీం
సైక్లింగ్ పోటీలు ఎక్కడ జరిగినా మంచి స్పందన వస్తుంది. నేను చాలా పోటీలు పాల్గొన్నాను. ఈ పోటీల్లో నేను సిల్వర్ మెడల్ గెలుచుకున్నాను. సైక్లింగ్‌ను కేవలం వేగం కోణంలోనే చూడొద్దు. ఈ పోటీల్లో వేగానికి మైండ్ ఐప్లె చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన ట్రాక్‌లోనే వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలి. లైన్‌కు దూరం జరిగిన కొద్దీ గమ్యస్థానం మనకు దూరమవుతూ ఉంటుంది. అండర్ -18లో పాల్గొన్నాను. మా ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించిన హైదరాబాద్‌కు థ్యాంక్స్. -దానమ్మ, సిల్వర్ మెడల్ విజేత
క్లిష్ట పరిస్థితుల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సైక్లింగ్ అనేది కొంత సాహసోపేతమైన క్రీడగానే భావిస్తాను. కొంచెం అదుపుతప్పినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. అయితే రెప్పపాటులో చేసిన చిన్న తప్పిదం ఈ పోటీల్లో విజేతగా నిలువలేకపోయాను. సైకిల్ అదుపు తప్పింది. చాలా గాయాలయ్యాయి. కానీ దెబ్బలు భరించాల్సిందే. మళ్లీ మరో పోటీలో తీవ్రంగా ప్రయత్నిస్తా. -లాల్చెన్భ, ఇంటర్నేషనల్ సైక్లింగ్ ప్లేయర్, మణిపూర్
హైదరాబాద్ స్టేడియం మాకు బాగా నచ్చింది. సైక్లింగ్‌కు ఇదే స్టేడియం సరైనది. నిజంగా ఈ పోటీలకు రావడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇక్కడికి రావడం నాకు మొదటిసారి. హైదరాబాద్ బిర్యానీ రుచి చూసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సైక్లింగ్‌ను నగరవాసులు చాలా ప్రోత్సహించారు. వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. -అభినంత్, నేషనల్ ప్లేయర్, కేరళ.
ప్రతి రోజూ ఉదయం సాయంత్రం కనీసం మూడు గంటలైనా సైక్లింగ్ కోసం కష్టపడ్డాను. అలా నెలల తరబడి సాధన చేశాను. హైదరాబాద్‌లో పోటీలు జరుగుతున్నాయని తెలిసి..చాలా సంతోషం అనిపించింది. పోటీలు సజావుగా సాగాయి. నేను గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. -భాగ్యశ్రీ, గోల్డ్ మెడల్ విజేత, సైక్లింగ్ చాంపియన్, కర్ణాటక.
రోడ్డు సైకిళ్లు, ట్రాక్ సైకిళ్లు వేరుగా ఉంటాయి. ఒక గేరుతో, బ్రేకులు లేకుండా.. కాళ్ల సాయంతో నిలిపేవి ట్రాక్ సైకిళ్లు. ఇప్పుడు చాంపియన్ పోటీల్లో వీటితోనే పోరు సాగింది. సుమారు 20 గేర్ల వరకు ఉండి హ్యాండిల్ బ్రేకులు అమర్చి ఉండేవి రోడ్డు సైకిళ్లు. వాటిని ట్రాక్ పోటీలకు అనుమతించరు. అంతేకాదు ట్రాక్ సైకిళ్లను కార్బన్‌ఫైబర్‌తో తయారు చేయడం వల్ల బరువు తక్కువగా ఉండి వేగంగా దూసుకెళ్తాయి. ఎంత బరువు తక్కువగా ఉంటే.. అంత వేగం పెరుగుతుందని నిపుణులు తెలిపారు.
పోటీదారుడు ఎంత శక్తిని వినియోగిస్తే..అంతకు రెట్టింపు స్పీడుతో వెళుతాయి. అయితే పోటీల్లో మాత్రం సైకిల్ బరువు 6.8 కేజీలకు తగ్గకూడదనే షరతులు విధిస్తారు. సైక్లింగ్ పోటీల్లో విభిన్న రకాల కేటగిరీలు ఉంటాయి. అండర్- 14, 16, సబ్ జూనియర్స్, 18, జూనియర్స్, ఆపై వయస్సు, సీనియర్స్ ఇలా గ్రూపుల వారీగా సైక్లింగ్ ఉంటుంది. ఒక్కో కేటగిరీలో గంటకు వేగం నిర్ణయిస్తారు. అందుకు తగ్గట్టు నిర్దేశించిన ట్రాక్‌లో సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది.