మియాపూర్ , ఫిబ్రవరి 9: మద్యం తాగుతుండగా తలెత్తిన వివాదంతో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరువు మండలం లక్డారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రవీణ్ (26) పేపర్లు ఏరుకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. కాగా, బుధవారం రాత్రి మియాపూర్ బస్‌స్టాప్ వెనక ఉన్న వైన్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తితో కలిసి మద్యం సేవించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తి ఓ బండ రాయితో ప్రవీణ్ తలపై మోదటంతో అతడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.