కాచిగూడ,ఏప్రిల్ 17: కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి చెందాయని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట నియోజకవర్గంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు శుక్రవారం సెల్ఫోన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని 34 అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, కేంద్రాల మౌలిక వసతుల మెరుగుదలతో పాటు పిల్లలకు మెరుగైన సేవలు అందించేందుకు సమగ్ర ప్రణాళికను రూపోందిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులకు ఫ్రీ-స్కూల్ విద్యతో పాటు పోషకాహారం అందించేందుకు ప్రత్యే దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు,హెల్పర్ల పోస్టులను త్వరితగతీన భర్తీ చేయాలని, కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.