సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టులో ఎన్నో ఇంజినీరింగ్ సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు నైపుణ్యం కలిగిన రైల్వే ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. రాయదుర్గం నుంచి నానక్‌రాంగూడ వరకు ఉన్న మార్గాన్ని రైల్వే బోర్డు మాజీ మెంబర్, ఇంజినీర్ సుబోధ్ జైన్, ఇతర సీనియర్ ఇంజినీర్లతో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ మార్గాన్ని ఇంజినీర్లు అడుగడగునా క్షుణ్ణంగా పరిశీలించారు. రాయదుర్గం మెట్రోస్టేషన్ తర్వాత మైండ్ స్పేస్ జంక్షన్లో ఫ్లైఓవర్, అండర్‌పాస్ ఉండడం, దాని పొడవు ఎక్కువగా ఉందని గుర్తించారు. అదేవిధంగా బయోడైవర్సిటీ జంక్షన్లో ఇప్పటికే రెండు ఫ్లై ఓవర్లు ఒకదానిపై మరొకటి వెళ్తున్నాయి. ఈ రెండు చోట్ల మెట్రో కోసం నిర్మించే పిల్లర్లను అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇది ఒక సవాలు లాంటిదని నిపుణుల బృందం గుర్తించిందన్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం పరిశీలనలో హెచ్ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్.ఈ వై.సాయపురెడ్డి, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ జేఎన్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివిధ అంశాల పరిశీలన..
సుమారు 21 మీటర్ల (69 అడుగులు) ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ ను దాటడం ఒక పెద్ద సవాలు. ఈ జంక్షన్లో కింద అండర్ పాస్, మధ్యలో రోటరీ, పైన ఫ్లైఓవర్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. ఈ అడ్డంకిని దాటడానికి ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ గర్డర్లతో చిన్న స్పాన్లుగా మెట్రో వయాడక్ట్‌ను నిర్మించడం లేదా కాంపోజిట్ స్టీల్ గర్డర్తో 90 మీటర్ల (295 అడుగులు) పొడవైన ప్రత్యేక స్పాన్ ని ఇన్ సిటు (అకడికకడే నిర్మాణం) విధానంలో నిర్మించే అంశాన్ని పరిశీలిస్తారు.
స్పాన్ పొడవు, గర్డర్ రకం, నిర్మాణ పద్ధతిని నిర్ణయించేటప్పుడు, అండర్ పాస్, రోటరీ.. ఫె్లైఓవర్ల నిర్మాణ డ్రాయింగ్లను జీహెచ్ఎంసీ నుంచి తీసుకొని మెట్రో రైల్ ఇంజినీర్లు విశ్లేషిస్తారు.
పొడిగించిన మెట్రో కారిడార్ 3 (బ్లూ లైన్) ఎయిర్ పోర్ట్ మెట్రో స్టేషన్ కొత్త ఇంటిగ్రేటెడ్ రాయదుర్గం స్టేషన్‌కు సంబంధించిన విభిన్న నిర్మాణ ప్రక్రియలు ప్రధానంగా ప్రయాణికుల సౌలభ్యం కోణం నుంచి పరిశీలిస్తారు. ఈ బహుళ స్థాయి ఇంటర్ చేంజ్స్టేషన్కు ఆనుకుని ఉన్న ఎక్స్ట్రా హై వోల్టేజ్ 400 కేవీ భూగర్భ కేబుళ్లు మార్చకుండా ఉండేలా స్టేషన్ డిజైన్ చేస్తారు.
విమానాశ్రయం మెట్రో వయాడక్ట్ బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద 20 మీటర్ల (66 అడుగులు) ఎత్తులో బహుళ స్థాయి ఫె్లైఓవర్ ను దాటడం మరొక సవాలు. ఫె్లైఓవర్ పిల్లర్ల పునాదులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు ఎయిర్ పోర్ట్ మెట్రో పిల్లర్లను ఫె్లైఓవర్ పిల్లర్లకు దూరంగా స్టేగర్డ్ (ఒకటి విడిచి ఒకటి) రీతిలో ఏర్పాటు చేస్తారు. ఫె్లైఓవర్ మీదుగా నిర్మించబడే స్పాన్ క్రాసింగ్ ను ఇన్ సిటు పధ్ధతిలో ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ గర్డర్లతో ప్లాన్ చేయవచ్చు.
రోడ్డు మీడియన్ వంపులో ఉన్నందున నానక్‌రాంగూడ జంక్షన్ స్టేషన్‌ను పోర్టల్ నిర్మాణంగా రూపొందించాల్సి ఉంటుంది. వివిధ దిశలు.. రోడ్ల నుంచి వచ్చే ట్రాఫిక్ అవసరాలను తీర్చడానికి స్టేషన్‌ను జంక్షన్ కు దగ్గరగా నిర్మించాలి.