సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆబ్కారీ శాఖలో బుధవారం రాత్రి జరిగిన 562మంది సీఐ, ఎస్ఐ, ఏఈఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌ల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఐల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్స్‌ను నేరుగా జారీ చేయకుండా రహస్యంగా ఒకరి పోస్టింగ్ మరొకరికి తెలియకుండా ఎవరి పోస్టింగ్ ఆర్డర్లను వారికి వ్యక్తిగతంగా పంపించడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. గతంలోనే ఈ బదిలీల వ్యవహారంలో రూ.3కోట్ల ప్యాకేజ్ ఒప్పందం కుదిరినట్లు వచ్చిన ఆరోపణలను నమస్తే తెలంగాణ బయట పెట్టిన విషయం తెలిసిందే. దీంతో బదిలీల ప్రక్రియ మూడు నెలల పాటు వాయిదా పడింది.
మూడునెలల తరువాతైనా కూడా ఎట్టకేలకు పైరవీకారులే విజయం సాధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆబ్కారీ చరిత్రలోనే తొలిసారిగా ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా సీఐల బదిలీలను జరపడంపై అధికారులు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఇతర అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు ఆప్షన్స్ కూడా అడిగిన ఉన్నతాధికారులు సీఐల విషయంలో మాత్రం ఎందుకు విస్మరించారనేది మిస్టరీగా మారింది. దీనిపై యూనియన్లు కూడా నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిఐల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ ఇష్టానుసారంగా జరిగినట్లు బాధిత అధికారులు ఆరోపిస్తున్నారు.
సమన్యాయం ఎక్కడ…?
క్యూర్ పరిధిలోని అధికారులు క్యూర్ గడప దాటాల్సిందే అని, ఒక డివిజన్లో పనిచేస్తున్న అధికారులకు ఆ డివిజన్ దాటి బయటకు వెళ్లాల్సిందేనంటూ మౌఖికంగా సెలవిచ్చిన అధికారులు ఆచరణలో మాత్రం ఒప్పందాలకే ప్రాధాన్యమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత డిమాండ్ ఉన్న క్యూర్ పరిధిలో పనిచేస్తున్న చాలా మంది అధికారులకు మళ్లీ అదే పరిధిలో పోస్టింగ్‌లు ఇవ్వడం, ఇతరులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దేని ఆధారంగా బదిలీలు చేసి, పోస్టింగ్‌లు ఇవ్వాలనే దానిపై స్పష్టత లేకుండా, ఎలాంటి మార్గదర్శకాలు జారీచేయకుండా, మౌఖిక ఆదేశాలనూ పాటించకుండా పోస్టింగ్‌లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అధికారులు మండి పడుతున్నారు.
చక్రం తిప్పిన నాయకులు
సీఐల బదిలీల్లో కొందరు యూనియన్ నాయకులు చక్రం తిప్పినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ యూనియన్ నాయకుడు రూ.3కోట్లతో 13 మంది సీఐల ప్యాకేజీని రూపొందించుకుని తనతో పాటు వారందరికీ క్యూర్ పరిధిలో అనుకున్న పోస్టింగ్‌లు ఇప్పించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు కమిషనర్ సమాధానం చెప్పాలి
బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను ఎందుకు రూపొందించలేదు. ఇతర అధికారులు, సిబ్బందికి ఇచ్చినట్లు సీఐలకు ఆప్షన్స్ ఎందుకు అడగలేదో ఆబ్కారీ శాఖ కమిషనర్ సమాధానం చెప్పాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియ పారదర్శకంగా జరిగితే ప్రొసిడింగ్ ఆర్డర్స్‌ను రహస్యంగా ఎవరివి వారికి, వ్యక్తిగతంగా జారీచేయడంలో గల ఆంతర్యమేంటో కమిషనర్ చెప్పాలని బాధిత అధికారులు డిమాండ్ చేస్తున్నారు. క్యూర్ పరిధిలో జరిగిన బదిలీలు, పోస్టింగ్‌లలో అన్నీ అక్రమాలే జరిగాయని, ఎక్సైజ్ స్టేషన్లు, ఇతర పోస్టింగ్‌లను సంతలో సరుకులా అమ్ముకున్నారని కొందరు అధికారులు ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.