సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): డ్రోన్ టెక్నాలజీలో ముందున్న రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలకు డ్రోన్ల ద్వారా మందులు అందజేసి రికార్డు సృష్టించింది. ఇదే విషయాన్ని నాలుగు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రోన్ టెక్నాలజీ ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించారు. డ్రోన్ టెక్నాలజీ ఏ విధంగా మేలు చేస్తుంది, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయన్న విషయాలను ఆ కార్యక్రమంలో వివరించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ ఉటంకించిన డ్రోన్ ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్ జిల్లాలో డ్రోన్ల ద్వారా మారుమూల గ్రామాలకు కరోనా టీకాలు, మందులు సరఫరా చేసే విధానాన్ని (మెడిసిన్ ఫ్రమ్ ది స్కై) విజయవంతంగా పూర్తి చేశారు.
దీన్నే భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేయనున్నామని ప్రధాని ప్రకటించడం మనకు గర్వకారణం. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు రూపకల్పనలో రాష్ట్ర ఐటీ శాఖ విశేషంగా పనిచేస్తోంది. ఐటీ రంగంలో ప్రైవేటు సంస్థలు చేయని ప్రయోగాలను తెలంగాణ సర్కారు చేసి చూపిస్తున్నది. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన సేవలందించేలా దృష్టి సారించింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్‌ను ఏర్పాటు చేసి ఐటీలో విప్లవాత్మక మార్పులు తెచ్చే సాంకేతిక పరిజ్ఞానాలను గుర్తించి, వాటిద్వారా ప్రయోగాలు చేస్తూ, వాటిని ప్రభుత్వ పాలనలో వినియోగించుకునేందుకు పలు స్టార్టప్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. అలా వచ్చిందే మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఒకటైన డ్రోన్ టెక్నాలజీతో ఇప్పటికే పలుమార్లు ప్రయోగాత్మక దశలను పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే మొదటిగా గుర్తింపు సాధించింది.
డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యతను గుర్తించి గచ్చిబౌలిలోని ట్రిఫుల్ ఐటీ ప్రాంగణంలో డ్రోన్ టెక్నాలజీపై ఎక్సలెన్సీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్టార్టప్‌లకు మూల కేంద్రమైన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్షిప్ (సీఐఈ)లో ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో డ్రోన్ టెక్నాలజీతో విప్లవాన్ని తెచ్చేందుకు మంచి వేదికగా దీన్ని తీర్చిదిద్ది, సరికొత్త ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించనున్నారు. స్టార్టప్ ఎకో సిస్టంలో హైదరాబాద్‌లో అనుకూల వాతావరణం ఉండటంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం ఔత్సాహికులు ఇక్కడికి వస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలను ప్రారంభించే వారికి ఫండింగ్‌తోపాటు నిపుణుల సహాయ సహకారాలను అందించనున్నారు.
గచ్చిబౌలి ట్రిఫుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్షిప్ (సీఐఈ)లో మారుత్ డ్రోన్ స్టార్టప్ కంపెనీగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇదే కంపెనీ వికారాబాద్ జిల్లాలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు కోసం డ్రోన్లను తయారు చేసి, క్షేత్రస్థాయిలో పరీక్షించారు. 5 కి.మీ మొదలుకొని 42 కి.మీ వరకు మందులను నిర్ణీత ఉష్ణోగ్రతలతో సరఫరా చేసి విజయవంతమైంది. ఈ కంపెనీయే పూర్తిస్థాయిలో డ్రోన్లను తయారు చేసి, వాటికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది.
ఐటీతో ఇప్పటికే పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వాటి ఫలితాలను అనుభవిస్తున్నాం. భవిష్యత్‌లో కూడా మరిన్ని మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పరిశోధన, ప్రయోగాలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించింది. డ్రోన్ టెక్నాలజీతో స్టార్టప్ కంపెనీలు నిర్వహిస్తున్న వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు దీన్ని వేదికగా చేస్తున్నారు. ప్రభుత్వపరంగా డ్రోన్ టెక్నాలజీని విరివిగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తే, పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది ఆసక్తి చూపనున్నారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న డ్రోన్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా వినియోగించేలా ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేసే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండటంతో ప్రైవేటు సంస్థలు, పెట్టుబడిదారులు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానున్నారు.
డ్రోన్ టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు విజయవంతం కావడంతో పలు కంపెనీలు నేరుగా పెట్టుబడులు పెట్టి 3 జిల్లాల్లో ప్రత్యక్షంగా మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. ఫార్మా కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకొని డ్రోన్ ద్వారా రవాణా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా రెండురోజుల కిత్రం హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్లకు సంబంధించిన తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న త్రిశూల్ కంపెనీలో ట్రెంటర్ కంపెనీ సుమారు 75 శాతం వాటాను కొనుగోలు చేసింది. మొత్తంగా ఆ కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఇదంతా రెండుమూడేండ్లుగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీ-హబ్, సీఐఈ ఇంక్యుబేటర్లలోని స్టార్టప్‌లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయోగాలే కారణమని ఐటీ నిపుణులు అంటున్నారు.