మాదాపూర్, జూన్ 28: పెయింట్స్ రంగంలో హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ కమర్షియల్ యాడ్‌ను బుధవారం మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి విచ్చేసి నమ్రత మహేశ్ ఘట్టమనేని, రాజ్యసభ ఎంపీ అమోధ్య రామిరెడ్డి, మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డైరెక్టర్ బి. శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యూడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డిలతో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫార్చూన్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… భారత్‌లో పెయింట్స్ రంగంలో సుస్థిర స్థానం నెలకొల్పాలన్న లక్ష్యంతో నాణ్యమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు.
తెలుగు రాష్ర్టాల్లో రూ. 12 వందల కోట్ల పెయింట్స్ పరిశ్రమలో 25 శాతం వాటా లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. 12 నుంచి 18 నెలల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. 5 వేల టచ్ పాయింట్లతో ఉత్పత్తులను చేరవేయనున్నట్లు తెలిపారు. పటాన్చెరులో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్ వేర్ హౌజ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం ప్రస్తుతం ఒక లక్ష మెట్రిక్ టన్నులు ఉంటుందన్నారు. వచ్చే ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, విశాఖపట్నంతో పాటు ఒడిశాలో నెలకొల్పితే 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు.
Hyd2
ప్రభుత్వం నుంచి భారీ ప్రాజెక్టులు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఊరు – మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను టెక్నో పెయింట్స్ చేపట్టినట్లు భారీ ప్రాజెక్టు ఫార్చూన్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.