Kokapet మణికొండ, డిసెంబర్ 19: కోకాపేట నియోపోలీస్లో గురువారం బ్లాస్టింగు బాంబుల మోతతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. ఒకటి కాదు, రెండు కాదు ఏక కాలంలో పది బ్లాస్టింగులు జరుగడంతో చుట్టు పక్కల ఉన్న జనం భయంతో పరుగులు తీయడం మొదలు పెట్టారు. వివరాలల్లోకి వెళితే, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట నియోపోలీస్లో ప్లాట్ నం.3లో నిర్మాణ పనుల్లో భాగంగా గురువారం పదిచోట్ల బ్లాస్టింగులు చేశారు. ఈ పేలుడుతో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు శబ్దం రావడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆటోలు, జేసీబీలు, పక్కనే శివాలయంలో ఉన్న అయ్యప్పస్వాములంతా పరుగులు పెట్టారు.
ఈ ప్రమాదంలో ఓ ఇటాచీ, ఆటో, ఓ గుడిసె పూర్తిగా ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న అయ్యప్పల శిబిరంపై రాళ్ల పెంకులు ఎగిరిపడటంతో కొంత మందికి స్వల్ప గాయాలైనట్లు బాధితులు తెలిపారు. వారం రోజులుగా బ్లాస్టింగుల వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో చేస్తున్నారని తెలిసింది. గురువారం తెల్లవారు జామున పేల్చాల్సిన బ్లాస్టింగులు ఉదయం పదిగంటల సమయంలో పేల్చడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ బ్లాస్టింగులకు ఏ మేరకు అనుమతులున్నాయనే దానిపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి చోట్ల అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత బ్లాస్టింగులకు అనుమతులివ్వాలని, లేకపోతే మా ప్రాణాలకే ప్రమాదంగా మారిందంటూ ఖానాపూర్, కోకాపేట వాసులు కోరుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా బ్లాస్టింగులు చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.