హైదరాబాద్ సిగలోకి కాళేశ్వర జలాలు
అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురుగుతో కుమిలిపోయిన మూసీ నది పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మూసీ మురికిని కూడా వదిలించనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వర జలాల్ని జంట జలాశయాలకు తరలించేలా అలైన్మెంట్ రూపొందించారు.
- కొండ పోచమ్మ-జంట జలాశయాల అనుసంధానం
- సంగారెడ్డి కాల్వ డిజైన్లోనే సీఎం కేసీఆర్ ముందుచూపు
- హైదరాబాద్‌కు అదనంగా 700 క్యూసెక్కుల ప్రవాహ కేటాయింపు
- గోదావరి జలాలతో దశాబ్దాల మురుగు మూసీ ప్రక్షాళన
- నగరం నడిబొడ్డున గోదావరి పరవళ్లతో విశ్వ నగరానికి సరికొత్త శోభ
- మూసీ వేదికగా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం
- లింకు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం
ప్రపంచంలోని అందమైన నగరాలు అనేకం నదుల ఒడ్డునే కొలువుదీరాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్… సెయిన్ నది ఒడ్డున ప్యారిస్… రెడ్ రివర్ ఒడ్డున వియత్నాం. మన చారిత్రక హైదరాబాద్‌కూ అలాంటి ప్రకృతి వరం ఉంది. నగరం మధ్య నుంచి సుందరంగా మూసీ నది ప్రవహిస్తున్నది. కానీ దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యంతో అది మురుగుకు పర్యాయపదంగా మారింది. అలాంటి చారిత్రక మూసీ నదికి తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరి జలాలను తరలించే లింకు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. కానీ వాస్తవానికి సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో కాళేశ్వరజలాలతో మూసీని మురిపించాలని సంకల్పించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రూపకల్పనలోనే ఈ లింకును పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి 700 క్యూసెక్కుల గోదావరి జలాలను జంట జలాశయాలకు కేటాయించారు. తద్వారా మూసీకి మురుగు కూపం నుంచి విముక్తి కల్పించి విశ్వనగర ప్రతిష్ఠతను మరింత ఇనుమడింపజేసేందుకు కార్యాచరణ రూపొందించారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ)
అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురుగుతో కుమిలిపోయిన మూసీ నది పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మూసీ మురికిని కూడా వదిలించనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వర జలాల్ని జంట జలాశయాలకు తరలించేలా అలైన్మెంట్ రూపొందించారు. ఈ మేరకు కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (జంట జలాశయాలు)కు లింకు ప్రాజెక్టుకు గురువారం తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
కొండపోచమ్మ టు గండిపేట ఇలా…
- కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండ పోచమ్మసాగర్ సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి బేసిన్లోనే ఇది గరిష్ఠ ఎత్తు.
- ఈ రిజర్వాయర్ నుంచి వివిధ ప్రాంతాలకు సాగునీటిని అందించడంలో భాగంగా 127 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వను ఏర్పాటు చేశారు.
- ఇది పూర్తిస్థాయిలో గ్రావిటీ కాల్వ. ఇందులో 27వ కిలోమీటర్ వద్ద మూసీ ప్రక్షాళన కోసం కాళేశ్వరజలాల్ని మళ్లించనున్నారు.
- వాస్తవంగా సంగారెడ్డి కాల్వ గరిష్ఠ వరద ప్రవాహ సామర్థ్యం 5054 క్యూసెక్కులు. ఇందులో సాగునీటికి 4,354 క్యూసెక్కులు కేటాయించగా… సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మిగిలిన 700 క్యూసెక్కులను జంట జలాశయాలకు తద్వారా మూసీ ప్రక్షాళనకు కేటాయించారు.
- సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వరజలాల్ని సమీపంలో ఉన్న రావిల్కోట్ చెరువుకు తరలిస్తారు.
- అక్కడి నుంచి కాల్వ లేదా పైపులైను ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు.
- ఇందుకు రావిల్కోట్ చెరువు నుంచి గండిపేట వరకు 52 కిలోమీటర్ల మేర గోదావరిజలాల తరలింపు ఉంటుంది.
- గండిపేట (ఉస్మాన్‌సాగర్) ఎఫ్ఆర్ఎల్ అంటే సముద్ర మట్టానికి 545 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో 618 మీటర్ల ఎత్తు నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు ఉస్మాన్‌సాగర్‌కు తరలించడం సులువైన ప్రక్రియ.
- హిమాయత్‌సాగర్ సముద్ర మట్టానికి (ఎఫ్ఆర్ఎల్) 537.25 మీటర్లు. ఈ నేపథ్యంలో గండిపేటలోకి వచ్చిన జలాల్ని సులువుగా హిమాయత్‌సాగర్‌లోకి తరలించవచ్చు. ఇందుకు సంబంధించి గతంలో పైప్‌లైన్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ దాని ద్వారా సాధ్యం కాకపోయినా… ఈ రెండు జలాశయాల మధ్య ఉన్న రిడ్జ్ పాయింట్ మీదుగా కాల్వ నిర్మాణంతో హిమాయత్‌సాగర్‌లోకి జలాల్ని తరలించవచ్చు.
- కాగా ఈ డిజైన్‌లో భాగంగా కేవలం గ్రావిటీ కాల్వ ద్వారానే కాకుండా పైప్‌లైన్ ద్వారా తరలించే ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి కాల్వ 104.250 కిలోమీటర్ నుంచి సుమారు 22 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ద్వారా గండిపేటలోకి కాళేశ్వరజలాల్ని తరలించవచ్చు.
పూర్తి కావస్తున్న కాల్వ పనులు…
సంగారెడ్డి కాల్వ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. సాగునీటి అవసరాల దృష్ట్యా జల వనరుల శాఖ 127 కిలోమీటర్ల కాల్వ నిర్మించనుంది. అయితే రావిల్కోట్ దగ్గరి నుంచి గండిపేట వరకు జలాల్ని తరలించే పనుల్ని జలమండలి చేపట్టాల్సి ఉంది. ఆ లింకు ప్రాజెక్టుకే తాజాగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాల వరకు 85 కిలోమీటర్ల కాల్వ పనులకుగాను 27 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వ పనుల్ని జల వనరుల శాఖ పూర్తి చేసింది. తదుపరి మిగిలిన 56 కిలోమీటర్ల కాల్వ పనుల్ని జలమండలి చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తయితే మూడున్నర టీఎంసీల చొప్పున గండిపేట, హిమాయత్సాగర్ల్లో కాళేశ్వరజలాలు నిండనున్నాయి. తద్వారా గోదావరిజలాలతో మూసీ పొడవునా మురికిని తొలగించి… ప్రక్షాళన పూర్తవుతుంది. కొండ పోచమ్మసాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరిజలాలను తరలించిన తర్వాత అవసరానికి అనుగుణంగా మూసీలోకి నీటిని వదిలేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుందని అధికారి ఒకరు తెలిపారు. ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ నుంచి గేట్ల ఎత్తిపోత ద్వారా వదిలే జలాలు వేర్వేరు మార్గాల్లో వచ్చి లంగర్‌హౌస్ వద్ద మూసీలోకి వస్తాయి. దీంతో పరిస్థితికి అనుగుణంగా మూసీలోకి గోదావరిజలాలు వదలడం ద్వారా మూసీ మార్గంలో ఉన్న వ్యర్థాలు కొట్టుకుపోయి నదీమార్గం అంతా సాఫీగా తయారు కానుంది.
పర్యాటకంలో పతాక స్థాయికి…
చారిత్రాత్మకంగానే కాదు భౌగోళికంగానూ అనుకూలంగా ఉండే నగరాలు ప్రపంచంలో వేళ్ల మీద లెక్కించవచ్చు. అందులో హైదరాబాద్ మహా నగరం కూడా ముందు వరుసలో ఉంటుంది. అందుకే అంతర్జాతీయంగా అనేక బడా కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలు తెరిచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మకంగానూ ఎంతో ప్రాధాన్యమున్న హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన పూర్తయితే మూసీ పరివాహక ప్రాంతమంతా పర్యాటకంగా అభివృద్ధి కానుంది. ఇప్పటికే ప్రభుత్వం పచ్చదనం, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటును ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఉదాహరణకు… థేమ్స్ నది ఒడ్డున పర్యాటకం అభివృద్ధి చెందడం ద్వారా 99వేల కుటుంబాలు నది ఒడ్డున వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. అంటే రానున్న కాలంలో మూసీ పరివాహక ప్రాంతం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందినట్లయితే వేలాది కుటుంబాలకు ఉపాధి లభించనుంది.
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం
కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరిజలాలను తరలించే ప్రక్రియ పూర్తయితే మరో చారిత్రక ఘట్టం కూడా ఆవిష్కృతం కానుంది. మూసీ కృష్ణాకు ఉపనది. జంట జలాశయాలకు గోదావరిజలాలను తరలించడం ద్వారా మూసీ నుంచి ఆ జలాలు తిరిగి కృష్ణాలోకి చేరనున్నాయి. అంటే వయా మూసీ గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం జరగనుండటం మరో విశేషం.
ప్రయోజనాలు…
- కొండ పోచమ్మసాగర్ నుంచి కాళేశ్వరజలాల్ని జంట జలాశయాలకు తరలించడం వల్ల చారిత్రక చెరువులకు పూర్వ వైభవాన్ని తెచ్చినట్లవుతుంది.
- రెండు జలాశయాల్లో నిత్యం నీటి నిల్వ ఉండటం వల్ల చుట్టూ పది-పదిహేను కిలోమీటర్ల ప్రాంతాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరగనున్నాయి.
- రెండు జలాశయాల్లో జలాలు ఉండటం వల్ల అతి తక్కువ ఖర్చుతో అనేక ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించవచ్చు.
- జంట జలాశయాల్లోకి గోదావరిజలాలు రావడం వల్ల మూసీలోకి జలాల్ని వదిలి మురికిని తొలగించవచ్చు. ప్రభుత్వం ఎలాగూ మురుగునీటి సమగ్ర ప్రణాళికలో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి… మురుగు నీరు నేరుగా మూసీలోకి కలవకుండా చర్యలు తీసుకుంటుంది. దీంతో మురుగురహిత మూసీ సాక్షాత్కారం కానుంది.
- ముఖ్యంగా మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి-యాదాద్రి, నల్లగొండ జిల్లాల పరిధిలో కాలుష్యజలాల పీడ వదలనుంది. నది పొడవునా చుట్టుపక్కల దోమల బెడద తప్పనుంది.
- ప్రస్తుతం మూసీ మురికికూపంలా తయారైనందున దాని పొడవునా సాగుతున్న వ్యవసాయంతో వచ్చే దిగుబడులు సైతం ఆరోగ్యపరంగా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రక్షాళన పూర్తయితే కొంతకాలంలో ఈ ప్రధాన సమస్య తీరనుంది.
- ముఖ్యంగా విశ్వనగరంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన హైదరాబాద్ నడిబొడ్డున మూసీ పారడం వల్ల పర్యాటకంగా అద్భుత శోభ రానుంది.
- లండన్‌లోని ఏథెన్స్, పారిస్‌లోని సెయిన్ నదుల ద్వారా ఆయా నగరాలకు పర్యాటకంగా, పర్యావరణంగా ఎంత ప్రయోజనం చేకూరుతుందో మూసీ ద్వారా హైదరాబాద్‌కు అంత ప్రయోజనం చేకూరనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

