ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటేనే కాంగ్రెస్ జంకుతుందా? దానం మీద వేటు పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమైన హస్తం పార్టీ ఇంకా దారులు వెతుకుతూనే ఉందా? ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ బలం.. సొంత పార్టీలో ముసలం.. వీటన్నింటిని తలచుకొని ఎట్లయినా ఉప ఎన్నిక రాకుండా పావులు కదుపుతుందా? దానం మీద వేటు కోసం బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం మొదలు కాంగ్రెస్ నేత విజయారెడ్డి తాజాగా హైకోర్టు తలుపు తట్టడం వరకు చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే అవును అనే సమాధానమే వినిపిస్తున్నది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఓటమి ప్రభావం ఎమ్మెల్సీ, గ్రేటర్ ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎన్నికలపై పడి రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి భవిష్యత్తు కుదేలవుతుందనే భయం ఆ పార్టీ
పెద్దల్లో ఉందనే ప్రచారం జరుగుతుంది. అందుకే వెంటాడుతున్న ఓటమి భయంతోనే తమ నేతల్ని తలోదారిన పంపి ఉప ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయిం చేలా ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నిక రేసులో తాను కూడా ఉన్నానంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంకేతాలిస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘నేను ఫైటర్‌ను.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా? ఎన్నికల్లో కొట్లాడటం నాకు కొత్తేమీ కాదు’ ఇది కదా.. నిన్నటిదాకా మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రగల్భాలు. కానీ ఇవన్నీ పైకి మాత్రమేనని.. ఉప ఎన్నికను తప్పించుకునేందుకు దానంతో సహా కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతుందని తేలిపోయింది. ఆది నుంచి దానంపై వేటు వేయాలని బీఆర్ఎస్ ఇటు అసెంబ్లీ స్పీకర్ ముందు.. అటు న్యాయస్థానాల్లోనూ తీవ్ర పోరాటం చేసింది.
ప్రతిసారి నాగేందర్ తాను పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవంటూ తప్పించుకుంటూనే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి.. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ స్పీకర్ మాత్రం ఆధారాలు లేవంటూ దానంపై వేటుకు నిరాకరించారు. ఈ క్రమంలో చివరకు హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని దానం నాగేందర్‌పై వేటు వేసింది. అయినప్పటికీ సుప్రీం కోర్టు నుంచి స్టే తెచ్చుకునేందుకు నాగేందర్ ప్రయత్నించినా అక్కడా చుక్కెదురైంది. ఇక తప్పని పరిస్థితుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయడంలో భాగంగా అసెంబ్లీ కార్యదర్శి ఖైరతాబాద్ స్థానాన్ని ఖాళీగా ప్రకటిస్తున్నట్లు అధికారికంగా గెజిట్ ఇచ్చి, ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలుపోటముల లెక్కల్లో ఓటమి ఖాయంగా కనిపించడంతో ఎలాగైనా ఉప ఎన్నిక వాయిదాకు చివరిదాకా ప్రయత్నించాలని నిర్ణయించింది.
కాంగ్రెస్‌లో మొదలైన రచ్చ..
ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన క్రమంలో రాజకీయంగా చర్చ మొదలు కాకముందే కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిని తానేనంటూ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తన అనుచరులకు సంకేతాలు ఇవ్వడంతో దానం నాగేందర్ సందిగ్దంలో పడిపోయారు. అందుకే ఉప ఎన్నికలో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో పడిపోయారు. ఇంకోవైపు ‘ముఖ్య’నేతను నమ్ముకొని కాంగ్రెస్ కండువా కప్పుకుంటే.. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటమి, ఆపై ఊసేలేని మంత్రి పదవి.. ఇవన్నీ చాలక నియోజకవర్గంలో కిందిస్థాయి అధికారి సైతం తన మాటను ఖాతరు చేయలేని సంక్లిష్ట పరిస్థితుల్లో దానం శిబిరం పూర్తి అయోమయంలో పడిపోయింది.
తాజాగా మాజీ మేయర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి సైతం టికెట్ రేసులో ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహించిన బంజారాహిల్స్ డివిజన్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉంది. దీంతో ఆమె కూడా ఉప ఎన్నిక టికెట్ రేసులోకి వచ్చినట్లుగా పార్టీ నేతలే స్పష్టం చేస్తున్నారు. గురువారం ఆమె బంజారాహిల్స్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అధికారులతో పర్యటించి ప్రజల సమస్యలపై దృష్టి సారించాననే సంకేతాలు ఇచ్చారని పేర్కొంటున్నారు. దీంతో కాంగ్రెస్‌లో ముసలం మరింత రంజుగా మారి… ఇప్పటికిప్పుడు ముగ్గురు కీలక నేతలు ఆ పార్టీలో టికెట్ కోసం ఆశిస్తున్న దరిమిలా ఏ ఒక్కరి వైపు మొగ్గు చూపినా పుట్టి మునిగేలా ఉందని పార్టీ పెద్దలు గుర్తించినట్లుగా తెలుస్తున్నది. ఉప ఎన్నిక వాయిదాకు ప్రయత్నించాలని నిర్ణయించడంలో ఇది కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు.