పీజేఆర్.. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాదు! రాష్ట్రవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన పేరు. 2009కు ముందు దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ నియోజకర్గమైన ఖైరతాబాద్ అనగానే గుర్తొచ్చే పేరు!! అలాంటి కీలక నియోజకవర్గానికి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఖైరతాబాద్‌లో నుంచి ఏర్పడినదే… జూబ్లీహిల్స్ నియోజకవర్గం. మరి అలాంటి జూబ్లీహిల్స్‌కు పి.జనార్దన్‌రెడ్డి నాన్ లోకల్ అట? జూబ్లీహిల్స్‌లో ప్రతి నిరుపేదను తట్టినా గొప్ప నాయకుడిగా కీర్తించే పీజేఆర్.. అసలు స్థానిక ఓటరే కాదంట? ఈ మాట అన్నది ఎవరో కాదు! పీజేఆర్ శ్వాస ఉన్నంత వరకు సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న నవీన్ యాదవ్. – బంజారాహిల్స్, అక్టోబర్ 9
బంజారాహిల్స్, అక్టోబర్ 9: ‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తొలిసారిగా లోకల్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కింది. మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి కూడా లోకల్ కాదు. ఆయన నాన్‌లోకలే’ అంటూ నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటన అనంతరం యూసుఫ్‌గూడలోని తమ నివాసం వద్ద నవీన్‌యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. 47 ఏళ్లలో తొలిసారిగా ఎవరూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికుడికి టికెట్ ఇవ్వలేదని, ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో పాలించిన వారంతా నాన్‌లోకల్ వాళ్లే అని అన్నారు.
ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ పెద్దనాయకుడని, నిరంతరం ప్రజల్లో కలిసిపోయి, సమస్యలు తీరుస్తూ వారికి అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతం నుంచి గొప్ప నాయకుడు అయ్యాడని చెబుతూనే.. పీజేఆర్ లోకల్ కానే కాదని.. నాన్‌లోకల్ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎన్నికైనవాళ్లంతా నాన్‌లోకలే అంటూ నవీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి.
ఉమ్మడి ఖైరతాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పీజేఆర్‌తో పాటు మాజీ మంత్రి విజయరామారావు, విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఉమ్మడి ఖైరతాబాద్‌కు చెందిన వారే కావడం గమనార్హం. మహానేత పీజేఆర్‌ను లోకల్ కాదంటూ పేర్కొనడం ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కుమార్తె విజయారెడ్డిలను కూడా తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయని సమాచారం.
పీజేఆర్ అభిమానుల ఆగ్రహం..
తెలంగాణ ప్రాంత ప్రజల కోసం సొంతపార్టీ ప్రభుత్వాన్ని కూడా నిలదీసిన మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పీజేఆర్ అభిమానులతో పాటు పాత కాంగ్రెస్ పార్టీనేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 1978నుంచి నగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పీజేఆర్ ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఖైరతాబాద్ నుంచి శేరిలింగపల్లి దాకా, జూబ్లీహిల్స్ నుంచి బాలానగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాలన్నీ ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉండేవి. 2008లో పీజేఆర్ మరణించేదాకా ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రాంతాలన్నీ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోనే ఉండేవి. ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అనేక బస్తీలను ఏర్పాటు చేయడంతో పాటు పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన పీజేఆర్‌ను అవమానించేలా నాన్ లోకల్ అంటూ నవీన్ యాదవ్ వ్యాఖ్యానించడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను విడగొట్టి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పీజేఆర్ కుమారుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా పేరు సంపాదించుకున్న పీజేఆర్‌ను ఉద్దేశించి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యానించడంలో అంతర్యమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో నవీన్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు పలుమార్లు ఎన్నికల్లో పోటీచేసినా ఏనాడూ గెలిచిన చరిత్ర లేదని, అటువంటి వ్యక్తి పీజేఆర్‌ను నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యానించడంపై సొంతపార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.