జూబ్లీహిల్స్, అక్టోబర్ 28: గత రెండేళ్లుగా ఎన్నో కంపెనీలు, పలు రకాల సంస్థలు మూతపడి వేలాది మంది నిరుద్యోగుల ఆశలను నీరుగార్చాయి. ఇప్పుడిప్పుడే.. పరిస్థితులు, వాతావరణం ఆశాజనకం కావడం, అన్నీ చక్కబడటంతో జాబ్‌మేళాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న మేళాల కారణంగా నిరుద్యోగుల జీవితాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, యూసుఫ్‌గూడలోని నిమ్స్‌మేలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. కరోనా సెకెండ్ వేవ్ తరువాత జాబ్ ఫెయిర్లకు మంచి ఆదరణ పెరిగింది.
యూసుఫ్‌గూడ నిమ్స్‌మేలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాకు ఆన్లైన్లో 12,391 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా 5665 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇందులో వివిధ కంపెనీలకు 1500 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, 47 మందికి నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ గ్లోరి స్వరూప ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మ్యాజిక్ బస్, టీటీ హబ్, విశ్వం ఎడ్యూటెక్, ప్రిజం మల్టీ మీడియా సంస్థల సౌజన్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో సుమారు 45 కంపెనీలు పాల్గొన్నాయి.
ఈ విద్యా సంవత్సరంలో ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి యూసుఫ్‌గూడ నిమ్స్‌మేలో ఇంటర్వ్యూకు హాజరయ్యాను. తొలి ఇంటర్వూలోనే బ్లూ బ్రిక్స్ కంపెనీలో ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. – హారిక, జగిత్యాల
ఇటీవల మ్యాజిక్ బస్ సంస్థ నిర్వహించిన జాబ్ ఫెయిర్‌లో ఉద్యోగం సంపాదించాను. నేడు విశ్వం ఎడ్యూటెక్ కంపెనీలో హెచ్ఆర్గా విధులు నిర్విర్తిస్తున్నాను. జాబ్‌మేళాతో నాలాంటి నిరుద్యోగులకు ఎంతోమంది నేడు ఉద్యోగాలు పొందుతున్నారు.- స్వర్ణరేఖ, హెచ్ఆర్, ఎడ్యూ టెక్
కనెక్ట్ విత్ వర్క్‌తో 24 గంటల ఉచిత శిక్షణతో పాటు వెంటనే ఉద్యోగాలు కల్పిస్తున్నాము. కరోనా సెకెండ్ వేవ్ తరువాత సుమారు 20 జాబ్ మేళాలు నిర్వహించాము. వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాము. – నదీమ్, ప్రాజెక్ట్ మేనేజర్
ప్రముఖ కంపెనీలతో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్వూలకు హాజరైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో నైపుణ్యాలు పెరుగుతాయి. ఆయా కంపెనీలలో ఉద్యోగాలు చేసిన అనుభవంతో కెరీర్లో నిలదొక్కుకుని గొప్ప ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలి. – గ్లోరి స్వరూప, నిమ్స్ మే డైరెక్టర్ జనరల్