Vana Mahotsavam | సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో పచ్చదనం పెంపు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రీనరీ పనులంటేనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది హరితహారం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరిట పచ్చదనం పెంపునకు సంకల్పించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్పల్లి, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లకు రూ.30.81 లక్షల నిర్దేశిత లక్ష్యాలను ఖరారు చేసి.. గత నెల 8న మంత్రుల చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పార్కులు , రహదారుల వెంబడి..సెంట్రల్ మీడియన్, ప్రభుత్వ, కేంద్ర రంగ సంస్థల్లో విరివిగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నిర్దేశిత టార్గెట్ కంటే ఎక్కువగా.. మొత్తం 50 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఖరారు చేసింది. ఇందులో భాగంగా అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు మొక్కలను నాటేందుకు ఒక్కో చోట రూ.5 నుంచి 10 లక్షలతో పనులను విభజించి టెండర్లను ఆహ్వానించారు. నగరవ్యాప్తంగా దాదాపుగా 3వేల చోట్ల పనులకు టెండర్లు పిలిచారు.
అయితే ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. కొన్ని చోట్ల ఆరుసార్లు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో చేసేది లేక అధికారులు ఏడోసారి టెండర్ వైపు వెళ్తున్నారు. బల్దియాకు సంబంధించిన పనులు చేస్తే సకాలంలో బిల్లులు రావన్న బలమైన వాదనల నేపథ్యంలో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని అధికారులే చెబుతుండటం గమనార్హం.