అమీన్పూర్, ఏప్రిల్ 12: అమీన్పూర్ సర్కిల్ ఐలాపూర్ గ్రామ శివారు పరిధి ప్రధాన రహదారి పక్కన హైడ్రా అధికారులు చిరు వ్యాపారులు వేసుకున్న షెడ్లను జేసీబీలతో కూల్చివేయించారు. సమయం ఇవ్వకుండా కనికరం లేకుండా..ఒక్కసారిగా షాపులను కూల్చివేయడంతో బాధితులు తీవ్రంగా ఆవేదన చెందారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి కూల్చివేసిన చోట ఉన్న వస్తువులను తరలించేందుకు అవస్థలుపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
ఏం చేయాలో తెలియడం లేదు
అధికారులు మా షాపును కూల్చివేస్తున్న సమయంలో కొందరు ఇష్టానుసారంగా మా సామాన్లను సైతం అపహరించుకుపోయారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం.
-దుర్గేశ్ , చిరు వ్యాపారి
సామాన్లు పనికి రాకుండా పోయాయి
ఫంక్షన్లలో డెకరేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్నా. హఠాత్తుగా వచ్చి షాపును ఖాళీ చేయమని అధికారులు చెప్పారు. ఖాళీ చేస్తున్న సమయంలో షెడ్డును కూల్చివేయించారు. డెకరేషన్ సామాన్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి.
-గణేశ్, చిరు వ్యాపారి