నగరవాసులను ఉర్రూతలూగించే రోజు రానే వచ్చింది. శని, ఆదివారాల్లో సాగర తీరంలో జరిగే ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆరు జట్లు.. 24 మంది రేసర్లు పాల్గొనే ఈ ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలిరోజు నేడు మధ్యాహ్నం 3 గంటలకు రేసింగ్ మొదలుకానున్నది. ఎనిమిది వేల మంది వీక్షించేలా ప్రత్యేక గ్యాలరీలను తీర్చిదిద్దారు. బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): నగరవాసులను ఉర్రూతలూగించే ఇండియన్ లీగ్ రేసింగ్ పోటీలకు అంతా సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. హుస్సేన్‌సాగర్ తీరాన అభిమానులను అలరించనుంది. ఈనెల (నేడు, రేపు) 19, 20న నిర్వహించే కార్ రేసింగ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి ఉదయం 8.30కు ప్రాక్టీస్ మొదలవుతుంది. అనంతరం పోటీలో భాగంగా మధ్యాహ్నం 3గంటలకు పోటీ ప్రారంభం కానుందని ఆర్గనైజర్ ఇందర్ శుక్రవారం తెలిపారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో స్ట్రీట్ రేసింగ్ నిర్వహించడం దేశంలోనే మొదటిసారని వెల్లడించారు. తిరిగి 20న మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5వరకు రేస్ కొనసాగుతుంందని పేర్కొన్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలోనే హైదరాబాద్‌లో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (స్ట్రీట్ రేసింగ్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు, ముడూ నెలల నుంచి రేసింగ్ పనులు ముమ్మరంగా కొనసాగాయి. ట్రాక్ కోసం తొలగించిన చెట్లను రీప్లాంట్ చేశామని, నేడు జరుగనున్న కార్ రేసింగ్‌కు పూర్తిస్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రేసింగ్ ట్రాక్ వెంట 7వేల నుంచి 8వేల వరకు ప్రేక్షకులు వీక్షించేందుకు సీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించామని చెప్పా రు. వీక్షకులకు బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
ఖైరతాబాద్, నవంబర్ 18: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భాగ్యనగరంలో ఇండియన్ రేసింగ్ లీగ్‌కు అతిథ్యమిచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తదితర విభాగాలు ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని పనులు పూర్తి కాగా, ఈ ట్రాక్‌లపై కార్లు కనీసం 240కి.మీ పైగా వేగంతో దూసుకుపోతాయి. చిన్న కాగితం కాని, చెత్త కాని అక్కడ ఉంటే రేసింగ్‌కు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేసింగ్ ట్రాక్‌పై పారిశుధ్యానికి ఎక్కడా లోపం లేకుండా జీహెచ్ఎంసీ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నది. అధికారులు అవసరనమైన సిబ్బందిని నియమించి రెండు షిఫ్టులో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. కేవలం ట్రాక్‌లు, గ్యాలరీల వద్దే కాదు..విదేశాల నుంచి రేసింగ్‌లో పాలుపంచుకునేందుకు వచ్చే అతిథులకు ఆతిథ్యమిచ్చే హోటళ్లు ఉన్న ప్రాంతాల్లోనూ పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తున్నారు. ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్‌నారాయణ పర్యవేక్షణలో రేసింగ్ ట్రాక్, పరిసర ప్రాంతాలతో పాటు అతిథులు బస చేసిన హోటళ్ల ప్రాంతాల్లోనూ సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల నేతృత్వంలో కార్మికులు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ పూర్తయ్యే వరకు పనులు చేపడుతామని ఖైరతాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి తెలిపారు.
2.8 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్‌లో రేసింగ్ కార్లు రయ్.. రయ్.. మని అభిమానులను అలరించనున్నాయి. ఒక్కో కారు 1600 సీసీ సామర్థ్యం కలిగి ఉంటుంది. క్షణాల్లోనే హెవీ స్పీడ్ అందుకొంటాయి. ఇందులో 6 జట్లు పాల్గొంటాయి. ఒక్కో జట్టులో నలుగురు రేసర్లు పాల్గొంటారు. ట్రాక్‌లో ప్రతి 20నిమిషాల చొప్పున డ్రైవర్లు మారుతారని ఇందర్ తెలిపారు.
ఇండియన్ రేసింగ్ లీగ్ (స్ట్రీట్ రేసింగ్) దేశంలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. లండన్ నుంచి సాంకేతికతతో పాటు ప్రణాళికను రూపొందించి అన్ని సేఫ్టీ రూల్స్‌తో కూడిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. 1600 సీసీ సామర్థ్యం కలిగిన కార్లో ఇటలీ ఇంధనాన్నే వాడనున్నట్లు వెల్లడించారు.
రేసింగ్‌కు ముందు సేఫ్టీ కార్లతో ట్రాక్‌ను పర్యవేక్షణ చేస్తారు. దీంతో పాటు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెనువెంటనే స్పందిస్తారు. రేస్ సమయంలో ట్రాక్‌లోని వాహనాల్లో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తినా ఈ వాహనాలు కంట్రోల్ చేస్తాయి. ఎంత స్పీడ్ వెళ్లాల్లో డైరెక్షన్ చేస్తుంటాయి. ఇవేగాకుండా మూడు నుంచి నాలుగు ప్రాంతాల్లో అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సహకారం మరువలేనిది. మొదటి సారిగా హైదరాబాద్‌లో నిర్వహించే కార్ రేస్‌కు ఏర్పాట్లు ఎంతో ఓర్పుతో చేపట్టారు. అధికారులు చాలా సపోర్ట్‌గా ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిబ్బంది ఎంతో ఓర్పుతో పనిచేశారు. తమ వైపు కూడా ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి రేసింగ్‌తో యువతకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. మన దేశ యువత విదేశాల్లో సైతం రేసింగ్‌లో పాల్గొంటున్నారు.
శనివారం..
ఉ.8-8:30గం వరకు రేసింగ్ లీగ్‌పై బ్రీఫింగ్
ఉ 9 -10గం వరకు ఇండియన్ రేసింగ్ లీగ్-ఎఫ్పీ1
ఉ 11 నుంచి 12 వరకు ఎఫ్పీ2
12-మ : 1 వరకు -లంచ్
సా.3:30 నుంచి 3:45 వరకు రేసింగ్(క్వాలిఫైంగ్)
సా.4నుంచి 4:45 వరకు రేసింగ్-రేస్1
4:45-5 వరకు -ఇంటర్వ్యూలు
ఆదివారం ఇలా..
ఉ.11-11:30 వరకు రేసింగ్ లీగ్ ఎఫ్పీ3
మ.12-1వరకు లంచ్
మ.1 నుంచి 1:15 వరకు క్వాలిఫైంగ్ లీగ్
మ.2 నుంచి 2:45 వరకు లీగ్ రేస్2
సా.3:30 -4:30 వరకు రేస్3
సా.4:30నుంచి 4:45 వరకు ఇంటర్వ్యూలు