సిటీబ్యూరో: ఆస్తిపన్నును ముందస్తుగా చెల్లించి ఎర్లీబర్డ్ స్కీం ద్వారా 5 శాతం రాయితీని అందిపుచ్చుకోవాలన్న అధికారుల ప్రకటనలకు ఉత్సాహంగా పన్ను చెల్లిస్తున్న యజమానులకు ఐటీ విభాగం లోపాలు చుక్కలు చూపుతున్నాయి. ఆన్లైన్ పేమెం ట్లు, రశీదుల జారీ ప్రక్రియ గందరగోళం నెలకొనడంతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధిత పన్ను చెల్లించిన వెంటనే జారీ అవుతున్న రసీదుల్లో కనీస వివరాలు నమోదు కాకపోవడం గమనార్హం. ఐటీ సాఫ్ట్వేర్ లోపాల కారణంగా పేమెంట్ అయ్యాక జారీ అవుతున్న రశీదుల్లో కేవలం చెల్లించిన మొత్తం, యజమాని వివరాలు తప్ప.. మిగతా కాలమ్స్ అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ సంవత్సరానికి ఆస్తిపన్ను చెల్లించామో అన్నది లేదు.
ఫలితంగా చెల్లింపులు జరుపుతున్న యజమానుల్లో పేమెంట్పై గ్యారెంటీ లేక అయోమయం నెలకొన్నది. ఐటీ విభాగం అధికారుల సమన్వయ లోపం వల్ల సర్వర్లు మొరాయించడం, పేమెంట్ ఫెయిల్యూర్లు కావడం, చెల్లింపులు చేసిన వాటికి గ్యారెంటీ లేకపోవడం సర్వసాధారణంగా మారిందంటూ యజమానులు మండిపడుతున్నారు.