సిటీబ్యూరో, మే 3(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనే 2022 సంవత్సరంలో అత్యధిక ఉద్యోగ ఆఫర్లు సాధించి అనురాగ్ యూనివర్సిటీ ఘన కీర్తిని సొంత చేసుకుందని అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఈ మేరకు విద్యార్థుల కోసం క్రికెట్ గ్రౌండ్, వివిధ డిపార్టుమెంట్లలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ వంటి సరికొత్త సౌకర్యాలతో అనురాగ్ వర్సిటీ విద్యార్థులు తమ విభిన్న అభిరుచిలతో కొనసాగించేలా చేస్తుందన్నారు. వర్సిటీ వార్షిక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిలిం డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ విద్యార్థులలో శక్తి పుష్కలంగా ఉందని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. వారు తమ చదువులు, వారి కలల కెరీర్లో రాణించడం ద్వారా వారి జీవితంలోని సవాళ్లతో తప్పనిసరిగా ప్రయోగాలు చేయాలన్నారు. పరిపూర్ణత వారిని మరిన్ని అవకాశాలు అన్వేషించేలా చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆనురాగ్ విద్యా సంస్థలకు చెందిన పూర్వ విద్యార్థిని హారికా నారాయణ్, ప్రముఖ సంగీత విద్యాంసుడు మిస్టర్ శాండిల్యలను యూనివర్సిటీ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో నాలుగు వేలకు పైగా విద్యార్థులు హాజరై పలు రకాల ప్రదర్శనలు వీక్షించారు. అనురాగ్ విద్యా సంస్థల సీఈవో ఎస్.నీలిమ, ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ బాలాజీ, సీఈవో డాక్టర్ జి.విష్ణుమూర్తి, ఫార్మసీ డీన్ వసుధ భక్షి, ఆర్ అండ్ డీ డీన్ డాక్టర్ విజయ్ కుమార్, డీన్ అగ్రికల్చర్ డాక్టర్ నారాయణరెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసా చలపతి, హెచ్వోడీలు పాల్గొన్నారు.