సిటీబ్యూరో, జూలై 15 ( నమస్తే తెలంగాణ): రోడ్డు నిబంధనలు పాటించకుండా వాహనం నడిపిన వారిపై వేటు పడనుంది. వారి లైసెన్స్ రద్దు కానున్నాయి. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చే డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దు ప్రక్రియను పర్యవేక్షించి.. త్వరితగతిన వాటిపై నిర్ణయం తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. రద్దు ప్రక్రియ న్యాయ నిబంధనలకు అనుగుణంగా చేయాల్సి ఉండటంతో అందుకు సంబంధించి జరిగే ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఆరు నెలల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 1721 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు.
నిర్లక్ష్యం వద్దు.!
ఇష్టానుసారంగా వాహనం నడపినా.. డ్రంకన్ డ్రైవ్ చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. తొలిసారి డ్రంకన్ డ్రైవ్ చేసి పట్టుబడితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. రెండోసారి దొరికితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. అంతేకాదు.. మోటారు వాహనాల సవరణ చట్టం- 2019, సెక్షన్ 206(4) ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే వీలు ఉంది. అతివేగం, ఓవర్ లోడ్, మరణాలకు కారణమయ్యే యాక్సిడెంట్లు చేయడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం.. తదితర నేరాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. పోలీసుల నుంచి ఉల్లంఘనదారుడి వివరాలు రవాణాశాఖకు చేరుకుంటాయి. రవాణా శాఖ అధికారులు వాటిని పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేస్తారు. పది రోజుల్లో అతడు తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం రవాణా శాఖ అధికారులు నిర్ణయం మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియ జరుగుతుంది.
రూల్స్‌కు వ్యతిరేకంగా నడుచుకోవద్దు
రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి. డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలు తీయొద్దు. ప్రమాదాలకు కారణమయ్యే వారిని ఉపేక్షించం. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రక్రియను వేగిరం చేశాం. వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి.
– ఎం.కిషన్ నాయక్, డీటీవో, మేడ్చల్