సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ):ఆకాశాన్నంటే నిర్మాణాలు..సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఫ్లైఓవర్లు..కుటుంబంతో హాయిగా గడిపేందుకు అధునాతన హోటళ్లు.. వినోదం కోసం మల్టీఫ్లెక్స్‌లు..ఇవీ నగర శివార్లలో వసతులు. ఒకప్పుడు సౌకర్యాలకు దూరంగా ఉన్న ప్రాంతాలు ఇవాళ నగరానికి దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల సముదాయాల నిర్మాణంతో జీవనశైలి మారిపోతోంది. ఇందుకు తగ్గట్లే పేరొందిన మాల్స్, సూపర్మార్కెట్లు, మల్టీప్లెక్స్‌లు వెలుస్తున్నాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ వేగంగా విస్తరిస్తుండడం, దిగ్గజ కంపెనీలు కొలువుదీరడంతో వారి నివాసం కోసం రియల్ ఎస్టేట్ కంపెనీలు 30 నుంచి 40 అంతస్తుల్లో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నాయి. ప్రధానంగా నల్లగండ్ల, కోకాపేట, నానక్‌రాంగూడ, నార్సింగి, కొంపల్లి, తెల్లాపూర్ వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి సాధించాయి. నగరంలో సుమారు 7 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగులుండగా, సింహభాగం శివార్లలో నివాసముంటున్నారు.
ఐటీ కారిడార్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది అద్దాల మేడలు, ఆకాశహార్మ్యాలు, అందులో కొనసాగుతున్న జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు. అయితే ఓఆర్ఆర్కు చెంతనే ఉన్న ఈ ప్రాంతానికి విందు, వినోదం, విజ్ఞానం కూడా తోడవుతున్నది. ఇప్పటి వరకు నగర నడిబొడ్డున మాత్రమే ఉన్న మాల్స్ అండ్ మల్టీఫ్లెక్స్ ఇక నుంచి ఐటీ సిగలో ఒక్కొక్కటిగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నిర్మాణ సంస్థలు దీనిపై దృష్టిసారించాయి. నల్లగండ్ల, కోకాపేట, నార్సింగి, కొంపల్లి, తదితర ప్రాంతాల్లో పనులను మొదలు పెట్టిన రియల్ ఎస్టేట్ కంపెనీలు మరో 2-3 ఏండ్లలో అందుబాటులోకి తీసుకురానున్నాయి. నల్లగండ్లలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ మాల్స్ అండ్ మల్టీఫెక్స్ నిర్మాణం ప్రారంభించగా, కోకాపేటలో మరో రెండు కంపెనీలు, నార్సింగిలో ఓ సంస్థ మాల్స్ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.
ఉద్యోగం, నివాసం ఒకే చోట.!
పనిచేసే చోటనే నివాసముండాలన్న ఉద్దేశంతో ఐటీ కారిడార్‌లో ఐటీ కంపెనీలతో పాటు భారీ బహుళ అంతస్థుల్లో నివాస ప్రాంతాలు వందల సంఖ్యలోనే వెలిశాయి. ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా పనిచేసే కార్యాలయాలకు నడుచుకుంటూ వెళ్లేలా ఒకే ప్రాంగణంలో ఆఫీసు భవనం, నివాస భవనాలను నిర్మిస్తున్నాయి. అదేవిధంగా వీకెండ్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవసరమైన కేంద్రాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఇనార్బిట్ మాల్, శరత్ క్యాపిటల్ మాల్ ఉండగా, కొత్తగా మరిన్ని రానున్నాయి.
ఐటీ కంపెనీలు శివారు ప్రాంతాలైన నార్సింగి, కోకాపేట, తెల్లాపూర్, నల్లగండ్ల ప్రాంతాలకు విస్తరించినట్లే నివాస ప్రాంతాలతో పాటు వాటి మధ్య భారీ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, మాల్స్ అండ్ మల్టీ ఫ్లెక్సుల నిర్మాణం జరుగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఐటీ రంగంలో సుమారు 7లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో సింహభాగంగా శివారు ప్రాంతాల్లోనే నివాసముంటున్నారు. వీరంతా మాల్స్, మల్టీఫ్లెక్సులకు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థలు వారికి సమీపంలోనే వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
శివార్లలో మెరుగైన మౌలిక వసతులు
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు రావాలంటే అత్యంత మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ పరంగా అనుకూల పాలసీలు ఎంతో ముఖ్యం. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి దశల వారీగా వాటిని పూర్తి చేస్తున్నది. దీంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే పెట్టుబడులకు కేంద్రంగా మారింది. కరోనా సమయంలోనూ అటు ఐటీ రంగం, ఇటు రియల్ ఎస్టేట్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులు నగరానికి వచ్చాయంటే నగరంలో ఉన్న మెరుగైన మౌలిక వసతులే కారణం.
ఐటీ కారిడార్‌లో రోడ్లన్నీ ఎంతో విశాలంగా, విదేశాలను తలపించే కూడళ్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి రాగా, ఇంకా మరికొన్ని రోడ్లు, ఫ్లై ఓవర్లు పురోగతిలో ఉన్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ఐటీ కారిడార్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ రహదారే. మైండ్‌స్పేస్ జంక్షన్ ఇప్పుడు సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా మారింది. ఇక్కడ సమాంతర రోడ్డుతో పాటు ఒక అండర్‌పాస్, ఫ్లై ఓవర్‌ను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిర్మించారు. ఇలా ఇప్పటికే పదుల సంఖ్యలో రోడ్లకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
ఐటీ రంగం విస్తరించినట్లే..!
దేశంలో ఐటీ పరిశ్రమల విస్తరణకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ నగరంలో ఒక్కొక్కటిగా కొలువుదీరుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ నగరం అత్యంత అనుకూలంగా ఉండడమే. ఐటీ రంగం అభివృద్ధి కాకముందు హైదరాబాద్ అంటే జంట నగరాలుగా ఉండేవి. అలాంటిది ఐటీ రంగం వృద్ధితో ప్రత్యేకంగా సైబరాబాద్ ప్రాంతం సరికొత్తగా అవతరించింది.
ప్రసుత్తం ఐటీ కంపెనీలు వెల్లువలా వస్తున్నట్లుగానే నివాస ప్రాంతాలు అంతకు మించిన స్థాయిలో వస్తున్నాయి. ఇదే పరిస్థితి మరిన్ని అవకాశాలకు దారితీస్తున్నది. ఐటీ ఉద్యోగులు వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే హోటల్స్, రెస్టారెంట్లతో పాటు మాల్స్ అండ్ మల్టీఫ్లెక్స్‌లు అత్యంత కీలకంగా మారాయి. ఐటీ ఉద్యోగుల అవసరాలే లక్ష్యంగా నగర శివారు ప్రాంతాల్లో వాటిని కల్పించేందుకు నిర్మాణ సంస్థలు తమ భవిష్యత్తు ప్రాజెక్టులను రూపొందిస్తున్నాయి.