మాదాపూర్, జూన్ 10: సరికొత్త డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో హెచ్జేఎఫ్ (హైదరాబాద్ జ్యువెల్లరీ, పర్ల్ అండ్ జెమ్ ఫెయిర్) 2022 ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా భారత్ అంబాసిడర్, ఎంబసీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ మొరాకో మహమ్మద్ మలికి, కాన్సులేట్ ఆఫ్ టర్కీ హైదరాబాద్ ఒరాన్ మెల్మాన్ ఒకాన్, హెచ్జేఎంఏ అధ్యక్షుడు మహేందర్ తాయల్, హెచ్జేఎంఏ కన్వీనర్ ముఖేశ్ అగర్వాల్, ఇన్ఫోర్మా మార్కెట్స్ ఇండియా యోగేష్ ముద్రాస్, ఇన్ఫోర్మా మార్కెట్స్ ఇండియా, గ్రూప్ డైరెక్టర్ పల్లవి మెహ్రాలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఫోర్మా మార్కెట్స్ ఇండియా యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ, మహిళలకు ఎంతో ఇష్టమైన బంగారు ఆభరణాలు ప్రదర్శనలో కొలువుదీరినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 250 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని 50 వేలకు పైగా వినూత్న డిజైన్లను నగరవాసుల కొరకు అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో బంగారు ఆభరణాలు వర్తకులు సైతం పాల్గొన్నారు.