సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ పాలసీ నిబంధనలు అమలు చేయాల్సిందేనని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 వోల్కన్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన ప్రభాకర్‌రావు ఎస్బీహెచ్ విశ్రాంత ఉద్యోగి. వోల్కన్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి 2016లో గ్రూప్ ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో కూకట్‌పల్లిలోని ప్రతిమ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం రూ.2,55,139 బిల్లు కాగా, బీమా సంస్థలు రూ.లక్ష మాత్రమే చెల్లించడంతో మిగతా మొత్తాన్ని పాలసీదారుడే చెల్లించాడు.
అనంతరం చికిత్సకు అయిన పూర్తి డబ్బుల గురించి బిల్స్ పత్రాలు, ఆధారాలతో వ్యతిరేకపార్టీలకు విజ్ఞప్తిచేసినా స్పందించకపోవడంతో కమిషన్‌ను ఆశ్రయించాడు. కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, ఆర్.నారాయణరెడ్డిలతో కూడిన బెంచ్ కేసు వివరాలను పరిశీలించి.. మిగతా డబ్బులు 9శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సిందేనని పేర్కొన్నది. ఇన్ని రోజులు పాలసీదారుడిని ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.20వేల జరిమానా విధించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది.