చార్మినార్/చాంద్రాయణగుట్ట, మార్చి 9: భావితరాల మనుగడ కోసం ప్రతిఒక్కరూ పర్యావరణంపై స్పృహ పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అర్వింద్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిటీ కళాశాలలో తెలుగు సాహిత్యం-పర్యావరణ చైతన్యం అంశంపై రెండు రోజుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పర్యావరణంతో పాటు జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు. పిల్లల కోసం ఎన్ని ఆస్తులు కూడబెట్టామన్నది ముఖ్యం కాదని.. వారికి నివాసయోగ్యమైన వాతావరణం కల్పిస్తున్నామా లేదా అన్నదే ప్రధానమన్నారు. రాష్ట్రంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతం పెంచేందుకు సీఎం కేసీఆర్ 2015 నుంచి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి 230 కోట్ల మొక్కలను పెంచారని గుర్తు చేశారు.
కొవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలు హరితహారంలో పాల్గొని విజయవంతం చేయడం గొప్ప విషయమన్నారు. 2021 అటవీ సర్వే నివేదిక ప్రకారం గడిచిన రెండేండ్లలో పచ్చదనం పెరిగిందని.. ఇందుకు రాష్ట్ర భాగస్వామ్యం గణనీయమని కొనియాడారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నుంచి గుర్తింపు పొందిన ఏకైన నగరం హైదరాబాద్ కావడం అందరికి గర్వకారణమన్నారు. దేశం, రాష్ర్టానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు, మేధావులను అందించిన సిటీ కాలేజీకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అజామ్హాల్ గ్రంథాలయాన్ని త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. ఐఏఎస్ వాణిప్రసాద్ మాట్లాడుతూ మనిషి అవసరాలు తీర్చడానికే ప్రకృతి ఉందని.. మనిషి విచ్చలవిడి తనానికి నాలుగైదు భూగోళాలైనా సరిపోవన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి మామిడి హరికృష్ణ, పర్యావరణవేత్త దుశర్ల సత్యనారాయణ, సాహితీవేత్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఐజాజ్ సుల్తాన, సంచాలకులు డాక్టర్ కోయి వేంకటేశ్వర్రావు, డాక్టర్ జె.నీరజ, ప్రజా కవులు సుద్దాల ఆశోక్‌తేజ, జయరాజు, అంబటి వెంకన్న, ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు, కొలకలూరి ఆశాజ్యోతి, సూర్యాధనంజయ్, సాగి కమలాకర శర్మ, డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి, డాక్టర్ సీతారాం, డాక్టర్ ఎస్.రఘు, డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి, దోరవేటి, కస్తూరి మురళీకృష్ణ, ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు.