Holi Celebrations | హోలీ.. వసంత కేళీ.. సప్తవర్ణ సమాహారం. భాగ్యనగరం యావత్తు సోమవారం ఇంద్ర ధనుస్సు శోభితమై విరాజిల్లింది. నగర వీధులన్నీ భిన్న వర్ణాలను పులుముకున్నాయి. నగరవాసులు యావత్తు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఎక్కడ చూసినా ఓ చిత్రకారుడు గీయని కళాఖండమే ఆవిర్భవించింది. ప్రపంచంలోని పలు వర్ణాలకు మహా నగరం పుట్టిల్లా..! అని ఆశ్చర్యపడేలా నగరం వివిధ రంగుల్లో మునిగితేలింది. హోలీ పండుగను నగరంలో కొన్ని చోట్ల ఆదివారం జరుపుకొన్నప్పటికీ, సోమవారమే అసలైన పండుగను నగరవాసులు బ్రహ్మాండంగా జరుపుకొన్నారు.
ఇందుకు గాను నగరంలో ప్రత్యేకంగా పలు వేదికలు వెలిసి, హోలీ పండుగను అమిత ఉత్సాహంతో జరుపుకొనేలా చేశాయి. పలు గేటెడ్ కమ్యూనిటీలలో ఈ వేడుక ఆధునిక పద్ధతిలో సాంకేతిక సాధనాల సాయంతో కొనసాగింది. ఇంకా నగరంలో నక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, జల విహార్, రెయిన్ బో విస్టాస్ కమ్యూనిటీలు ఈ పండుగకు కేంద్రాలు కాగా, చిన్నా, పెద్ద, యువత, వయోజనులంతా పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆప్యాయంగా శుభాకాంక్షలు చెబుకున్నారు. నగరంలో రంగుల సునామీ ఆవిష్కరించిందనేలా పండుగ జోరుగా సాగింది.
డీజే సంగీత హోరుకు చిన్నారుల నుంచి వృద్ధుల దాకా నృత్యాభినయం చేశారు. పండుగకు అనుకూలంగా కృత్రిమంగా వెలసిన కొలనులు, తటాకాలలో దూకి, ఈది, సయ్యాటలాడారు. పిల్లా జల్లా అంతా కేరింతలు కొడుతూ జలకాలాడారు. నగరంలో పలు చోట్ల ఒకరికొకరు శుభాకాంక్షలు చెబుకుని, మిఠాయిలు పంచుకుంటూ, రంగులు చల్లుకుని పండుగను ఆద్యంతం ఉత్సాహభరింతంగా అత్యంత సంబురంగా జరుపుకున్నారు. ఓయూ క్యాంపస్‌లోని విద్యార్థులతో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం వర్ణ రంజితమై తేనెతుట్టెను చుట్టుముట్టిన కందిరీగల్లా.. దర్శనమిచ్చింది.