ఖైరతాబాద్, ఆగస్టు 16 : చిత్తు కాగితాలను చెత్త బుట్టలో పడేస్తాం. కాని, ఓ ఉపాధ్యాయుడు ఆ చిత్తుకాగితాలతోనే బొమ్మల ఆకృతులను తయారు చేశారు. ఆ కళే ఆయనకు గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించి పెట్టింది. ఈ అద్భుత ఘనత సాధించిన కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయుడు తోలేటి రవికుమార్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ పీవీ సాయి రంగారావు, విద్యావేత్త, సైకాలజిస్ట్ డాక్టర్ బీఎస్ఎన్ మూర్తి, గ్రాడ్యుయేట్ టీచర్ టి. రవికుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత రవికుమార్ తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
రామంతాపూర్‌కు చెందిన తోలేటి రవికుమార్ విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. 1988లో కేంద్రీయ విద్యాలయంలో వర్క్ ఎక్స్పీరియన్స్ టీచర్‌గా పని చేశారు. విద్యార్థులకు పాఠాలను పుస్తకాల్లో చూసి చెప్పడం కాకుండా సృజనాత్మక విద్యను బోధించాల్సి ఉంటుంది. సృజనాత్మకతతో బోధించే పద్ధతుల్లో కొత్త ప్రాజెక్టును ప్రవేశపెట్టే యోచనలో పాఠశాల యాజమాన్యం ఉంది. ఆ నేపథ్యంలో ఒరిగామి కళపై పాల్ జాన్సన్ రాసిన పుస్తకాన్ని చదివారు. అందులో పేపర్ ఫోల్డింగ్ (మడతలు పెట్టి) కళాకృతులను తయారు చేసే మేళకువలు తెలుసుకొని, కేవలం 20 రోజుల్లోనే నేర్చుకున్నారు. కాగితాలతో వివిధ రకాల వస్తువులు, బొమ్మలు, ఆకృతులను తయారు చేసే ఈ కళను ఒరిగామి అంటారన్నారు. జపాన్ దేశంలో అక్కడి సంస్కృతికి చిహ్నంగా పేర్కొంటారు.
1996లో 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రీయ విద్యాలయం తరఫున ఇండియా గేటు వద్ద అక్కడికి వచ్చే పర్యాటకులు, ప్రజలకు ఉచితంగా ఒరిగామి కళాకృతుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏదైనా కొత్త ఫీటు చేయాలని ఆలోచించారు. అదే క్రమంలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ వారిని సంప్రదించారు. 1500 బొమ్మలను తయారు చేస్తే రికార్డులో పేరు నమోదు చేస్తామని చెప్పారు. దీంతో జాతీయ పక్షి నెమలిని తన పోటీకి ఎంచుకున్నారు. గతేడాది నవంబర్ 15న కేంద్రీయ విద్యాలయంలోని కళామందిర్ ఆడిటోరియంలో 15 రోజుల వ్యవధిలో 88 గంటలు కష్టపడి 1776 ఒరిగామి నెమళ్లను తయారు చేశారు. కెన్నడీ స్కూల్ డైరెక్టర్ బీఎస్ఎన్ మూర్తి, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సిటీ ఎడిషన్ ఎడిటర్ మంజులత కళానిధి సాక్షులుగా నిలిచారు. ఆ ఫీటును రికార్డు చేసిన గిన్నిస్‌బుక్ ప్రతినిధులు గత నెల 24న గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తూ ఆయనకు ప్రశంసా పత్రాన్ని పంపించారు.
తన 33 ఏండ్ల కల నెరవేరింది. ఈ గడ్డపై పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. నేను సాధించిన ఈ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును నా మాతృభూమికి అంకితమిస్తున్నాను. 2005లో ఢిల్లీలోని విజ్ఞాన సదన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డును, 2002లో ఎన్సీఈఆర్టీ నుంచి, 2012, 2019లో కేంద్రీయ విద్యాలయం తరఫున ఇన్నోవేషన్ అవార్డు అందుకున్నాను. త్వరలోనే 35వేల ఫోల్డ్స్ (మడతలు)తో 13అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వెడల్పుతో పోస్టర్‌ను తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇందులో కూడా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉన్నదని గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత రవికుమార్ తెలిపారు.