విద్యార్థుల వరప్రదాయిని ఓయూ మోడల్ స్కూల్
అందరికీ అందుబాటులో ఉచిత విద్య
ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో బోధన
అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, సిబ్బంది
విశాలమైన ప్రాంగణం, తరగతులు, కంప్యూటర్ ల్యాబ్
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 14 : కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే సౌకర్యాలు..తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో బోధన..ప్రశాంత వాతావరణం..విశాలమైన ప్రాంగణం..సుశిక్షుతులైన అధ్యాపకులతో విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తున్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ తర్ఫీదు ఇస్తూ ఆయా పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. నగరంలో ఇంత విశాలమైన స్థలంలో పాఠశాల ఉండడం అరుదు. యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది పిల్లల చదువు కోసం 1970లో ఓయూ ప్రాంగణంలోని అప్పటి సీఫెల్ (ఇప్పుడు ఇఫ్లూ) పక్కన సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాల ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యత, సిబ్బంది జీతభత్యాలు పూర్తిగా యూనివర్సిటీ ఖజానా నుంచే చెల్లిస్తున్నారు. ఒకప్పుడు పేరొందిన ఈ పాఠశాల కార్పొరేట్ పోటీలో వెనుకబడింది. కాలక్రమంలో ‘ఫీనిక్స్’ పక్షిలా తిరిగి ఓయూ మోడల్ స్కూల్ పూర్వ వైభవం సంతరించుకుంటున్నది. వనరులు, విద్యాబోధనతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నది.
నాణ్యమైన విద్య.. నామమాత్ర రుసుము
ఓయూలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఎస్సీ,ఎస్టీ, ఓయూ ఉద్యోగుల పిల్లలకు విద్య ఉచితం. ఇతర విద్యార్థులకు కేవలం అడ్మిషన్ సమయంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వారీగా ప్రత్యేక నామమాత్ర రుసుము వసూలు చేస్తారు. ఇక ఆ తర్వాత అంతా ఉచితమే.
తరగతిలో పరిమితంగా విద్యార్థులు
ఒక్కో తరగతిలో ఇంగ్లీష్, తెలుగు మీడియానికి వేర్వేరు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో గరిష్టంగా 40 మంది విద్యార్థులు ఉంటారు. తరగతిలో ఎక్కువ మంది ఉంటే ఉపాధ్యాయులు అందరిపై దృష్టి కేంద్రీకరించలేరనే ఉద్దేశంతో గరిష్ట విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం పాఠశాలలో దాదాపు 500 మంది వరకు అభ్యసిస్తుంటారు.
విశాలమైన గదులు.. కంప్యూటర్ పరిజ్ఞానం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్ననాటి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ఇందుకనుగుణంగానే పాఠశాలలో 12 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. 1వ తరగతి నుంచి కంప్యూటర్ గురించి విద్యార్థులకు వివరిస్తున్నప్పటికీ, 5 తరగతి నుంచి కంప్యూటర్ బేసిక్ స్కిల్స్, ఆపరేషనల్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. ప్రతినిత్యం ఒక పీరియడ్ కంప్యూటర్ క్లాస్ ఉంటుంది. అన్ని తరగతి గదులు విశాలంగా, మంచి వెలుతురుతో ఉంటాయి. చదువుకునేందుకు గ్రంథాయల సదుపాయం కూడా ఉంది.
అనుభవం గల అధ్యాపకులచే బోధన
ఇక్కడి పాఠశాలలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధిస్తారు. కొంత టీచర్ల కొరత ఉన్నప్పటికీ కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయులను నియమించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాల్సిన సంఖ్యలో ఉపాధ్యాయులతోపాటు నాన్‌టీచింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఉన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకొని వారికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తుంటారు.
ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలు
ప్రతి తరగతిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికి ప్రతి ఏటా నగదు బహుమతి అందజేస్తారు. అమెరికాలో స్థిరపడిన ఈ పాఠశాల పూర్వవిద్యార్థి ఈ నగదు బహుమతులను గత కొన్నేళ్లు అందజేస్తున్నారు. దీంతోపాటు ఓయూలోని ఎస్బీహెచ్ వారు పాఠశాల మొత్తంలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన ఇద్దరు విద్యార్థినులకు రూ.5000 చొప్పున అందజేస్తున్నారు.
పాఠశాల అభివృద్ధికి ఔదార్యం
పాఠశాల పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద మోడీ కన్స్ట్రక్షన్స్ సంస్థ పాఠశాలలో టాయిలెట్లను పునరుద్ధరిస్తున్నది. రూ.లక్షకు పైగా అంచనాతో ఈ పనులు జరుగుతున్నాయి. మరో దాత పాఠశాలకు 10 కంప్యూటర్లు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పాఠశాలలో వివిధ సదుపాయాలు నెలకొల్పేందుకు ముందుకొస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా వివిధ నైపుణ్యాలను (డీటీపీ, డ్రైవింగ్, ఎంబ్రాయిడరీ వంటివి) నేర్పించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకురావడం విశేషం. పలువురు దాతలు గ్రంథాలయానికి పుస్తకాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రతివారం విద్యార్థుల మధ్య పోటీలు
పాఠశాలలో విద్యార్థులను నాలుగుభాగాలుగా విభజిస్తారు. కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, షటిల్ బ్యా డ్మింటన్, క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, పాటలు పాడడం వంటి వాటిలో ప్రతి శనివారం మధ్యాహ్నం ఇంటర్హౌస్ పోటీలు నిర్వహిస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు ఎన్సీసీలో చేరే అవకాశం కూడా కల్పించారు. విద్యార్థులు ఆడుకునేందుకు విశాలమైన ప్లేగ్రౌండ్ ఉండడం ఈ పాఠశాల ప్రత్యేకత.
పాఠశాలకు పూర్వ వైభవం తెస్తాం
ఓయూ మోడల్ స్కూల్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వీసీ, రిజిస్ట్రార్ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఇటీవల సందర్శించిన వీసీ..పాఠశాలను హరితవనంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల శారీరక, మానసికోల్లాసానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నాం.
– డాక్టర్ పారిపల్లి శంకర్, స్పెషల్ ఆఫీసర్, ఓయూ మోడల్ స్కూల్