సుల్తాన్‌బజార్, జనవరి 22: సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏఈఎంలో డబ్బులకు చోరీకి విఫలయత్నం చేసి ఓ వ్యక్తి పోలీసులకి చిక్కి కటాకటాల పాలయ్యాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన గౌతంరాజేశ్(29) వైజాగ్‌లోని కేజీహెచ్ హాస్పిటల్‌లోని క్యాంటీన్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, అతను మద్యానికి, సిగరెట్లు వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడి పనిచేస్తూ వచ్చే ఆదాయం వ్యసనాలకు సరిపోకపోవడంతోపాటు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బులు, ఫోన్లు, ఆ టో మొబైల్ చోరీలను ఎంచుకున్నాడు.
దీంలో భాగంగా ఈనెల 19వ తేదీన రైలులో చర్లపల్లికి వచ్చి అక్కడ బస్సు, ఆటో ఎక్కేందుకు ట్రూఫిట్ క్యాబినెట్స్ కంపెనీ ముందు బస్టాప్‌కి వద్దకు వచ్చాడు. కాగా,అక్కడ రోడ్డు పక్కన హీరో స్ప్లెండర్(ఏపీ 24ఎఫ్ 3589) కీతో పార్క్ చేసి ఉన్నది. ఇది గమనించిన రాజేశ్ అందుబాటులో ఉన్న కీతో బైక్‌ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తదనంతరం ఆ బైక్‌ను వాడుకొని పడేసేందుకు యత్నించాడు. ఈనెల 21వ తేదీన బ్యాంక్‌స్ట్రీట్ ప్రా ంతంలో తిరుగుతుండగా.. సెక్యూరిటీగార్డు లేని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం కనిపించింది.
ఆ సమయంలో ప్రజల రద్దీ తక్కువగా ఉండటంతో ఇదే అదునుగా భావించిన రాజేశ్ ఏటీఎంలో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని అందులోకి వెళ్లి ఏటీఎం మిషన్‌లో నగదు చోరీ చేసేందుకు యత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఏటీఎం మిషన్‌ను బలంగా గుంజి కింద పడవేయడంతో ఏటీఎం మిషన్ పాడైంది. విషయం తెలుసుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మేనేజర్ ముల్లంపూడి రాంభూపాల్‌చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడు గౌతంరాజేశ్ను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి హీరో స్ల్పెండర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.