ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 05: ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలో వివిధ విదేశీ భాషల్లో(Foreign languages) డిప్లొమా కోర్సులకు(Diploma courses) దరఖాస్తుల స్వీకరణ గడువును పొడగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో నాలుగు నెలల జూనియర్, సీనియర్ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 4వ తేదీని చివరితేదీగా గతంలో ప్రకటించినప్పటికీ, గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడగించినట్లు పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు జూనియర్ డిప్లొమాలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. సీనియర్ డిప్లొమాలో చేరేందుకు కనీసం యాభై శాతం మార్కులతో జూనియర్ డిప్లొమా కానీ, యూజీలో సంబంధిత భాషను సెకెండ్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలని చెప్పారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు విదేశీ భాషల విభాగం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.