సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే చాలు కాలం చెల్లిన వాహనాలకు మరో ఐదేండ్లు ఊపిరినిస్తారు. ఆర్టీఏ నిబంధనలకు అనుగుణంగా అన్నీ సర్టిఫికెట్లతో అధికారులను సంప్రదిస్తే వాహనానికి రెన్యువల్‌కు అవకాశమిస్తారు. సాధారణంగా ఏ వాహనానికైనా 15 ఏండ్లు గడువు ఉంటుంది. ఆ గడువు మీరితే స్క్రాబ్‌కు అవకాశం ఉంటుంది. అయితే అదే వాహనం వినియోగించుకోవాలనుకుంటే రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఏండ్ల వరకు ఆ వాహనానికి అనుమతి లభిస్తుంది.
ఇలా అనుమతి లభించిన వాహనం 5 ఏండ్లు దాటినా.. మరోసారి రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సంబంధించినడాక్యుమెంట్లు ఉంటే వాహనానికి కాల పరిమితి అంటూ ఏమీ లేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వాహన గడువుకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. వాహనదారులు తమ వాహన గడువు ముగిసిందని బ్రోకర్లను ఆశ్రయించి డబ్బులు నష్టపోతున్నారు. ఎన్నేైండ్లెనా వాహనాన్ని రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఆర్టీఓకార్యాలయాలను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలన్నారు.
వాహన సామర్థ్యాన్ని బట్టి దఫ దఫాలుగా 5 ఏండ్లు రెన్యువల్‌కు అవకాశం ఉంది. అయితే సంబంధిత వాహనం ఆర్టీఏ అధికారులతో ధ్రువీకరించబడాలి. ఈ క్రమంలో ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలకు గ్రీన్ ట్యాక్సీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 15 ఏండ్లు నిండిన ద్విచక్ర వాహనానికి సాధారణ ఫీజు 1,435 ఉంటుంది. దీంతో పాటు గ్రీన్ ట్యాక్సీ 2వేలు చెల్లించాలి. గడువు ముగిసిన రోజులకు అంటే నెలకు రూ. 300 చెల్లించాలి. ఈ మొత్తం ఫీజు మీ-సేవలో సంబంధిత ఆర్సీతో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆధార్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఆర్సీ తదితర పత్రాలతో ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించాలి. అనంతరం ఆ వాహనం మరో ఐదేండ్లు వినియోగించడానికి అనుమతి లభిస్తుంది.
ఇదే లెక్కన 15 ఏండ్లు నిండిన ఫోర్ వీలర్ అయితే సాధారణ ఫీజు రూ.5,835తో పాటు గ్రీన్ ట్యాక్సీ రూ.5000లు ఉంటుంది. గడువు ముగిసిన పెనాల్టీ అంటే నెలకు రూ.500లు ఉంటుంది. ఈ మొత్తం ఫీజును మీ -సేవలో చెల్లించి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోర్ వీలర్ 20 ఏండ్లు వినియోగించి ఉంటే గ్రీన్ ట్యాక్సీ రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో ఐదేండ్ల వరకు వాహనం వినియోగించే వీలు ఉంటుందని వివరించారు. గ్రేటర్లో కాలం చెల్లిన వాహనాలను పరిశీలిస్తే.. ద్విచక్ర వాహనాలు 17 లక్షలు, కార్లు 4.5 లక్షలు, గూడ్స్ క్యారిజెస్ లక్ష, ఆటోలు 30 వేలు, ఇతర వాహనాలు 9వేలు ఉన్నట్లు సమాచారం.