సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 ( నమస్తే తెలంగాణ ) : అవగాహనలేమితో మహిళలు ఎక్కువగా ఎండో మెట్రియోసిస్ బారినపడుతున్నారని ‘ఎండో మెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ వ్యవస్థాపకురాలు డాక్టర్ బింద్ర చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ‘ఎల్లో రిబ్బన్ రన్’పై ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బింద్ర మాట్లాడుతూ.. పది మంది మహిళల్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు మార్చి 3న నెక్లెస్ రోడ్డులో ఉదయం 6 గంటలకు ‘ఎల్లో రిబ్బన్ రన్’ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేమని..
దాని ప్రభావాన్ని తగ్గించేందుకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే క్రమేణా వంధత్వం, ఊపిరితిత్తులు, కిడ్నీ తదితర సమస్యలు తలెత్తుతాయన్నారు. ఫ్యూచరిక్ సిటీస్ ప్రెసిడెంట్ కరుణా గోపాల్ వర్తకవి మాట్లాడుతూ.. మహిళలను శారీరకంగా, మానసికంగా కుంగుబాటుకు గురిచేసే ఈ భయానక వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలని చెప్పారు. అనంతరం ఎల్లో రిబ్బన్ రన్‌కు సంబంధించిన పోస్టర్‌ను వక్తలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైద్యులు శ్వేత , అర్చన, నటుడు శివ కందుకూరి, నటి రాశీసింగ్ తదితరులు పాల్గొన్నారు.