నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : మనిషి పాజిటివ్ దృక్పథంతో జీవించాలని, అధిక కేసుల పరిష్కారానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని నాంపల్లి కోర్టుల ఇన్చార్జి జిల్లా జడ్జి విక్రమ్ అన్నారు. హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అరుణకుమారి సమక్షంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధినిర్వహణలో భాగస్వామ్యులు కావాలని, రాజీయే రాజమార్గం అన్న నానుడిని తు.చ. తప్పకుండా కక్షిదారులు అనుసరించే విధంగా సహకరించాలన్నారు.
ప్రతీ మూడు నెలలకోసారి నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈసారి కూడా అధిక కేసుల పరష్కారానికి అన్ని కోర్టులకు చెందిన పీపీలు, మెజిస్ట్రేట్లు, న్యాయవాదులు, పోలీసులు కృషి చేయాలన్నారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు పోలీసు అధికారులు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఇరువర్గాలకు చెందిన కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ చేసుకునేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్, డిప్యూటీ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రామ్‌రెడ్డి పాల్గొన్నారు.