అత్తాపూర్, డిసెంబర్ 14: అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ప్రజా అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లు పనికి రాకుండా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అత్యవసర సమయంలో వాహనదారులు, పాదచారులు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ల పథకం కొంత మంది అధికారుల అలసత్వం కారణంగా ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయో టాయిలెట్లు నూతనంగా ఏర్పాటు చేసి సంవత్సరం అవుతున్న వాటిని పట్టించుకోకవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలుప్రాంతాల్లో ఏర్పా టు చేసిన బయో టాయిలెట్ల అధ్వానంగా మారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు అటు వైపూ.. కన్నె తి చూడటం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అత్తపూర్ డివిజన్లో చాలా చోట్ల ఏర్పాటు చేసినా బయో టాయిలెట్లు ప్రజలకు ఉపయోగంలో లేవు. ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ బయో టాయిలెట్లపై నిఘా లేకపోవడంతో కొంత మంది ఆకతాయిలు, చిల్లర దొంగలు సామాన్లను ఎత్తుకు వెళ్ళారు. ముఖ్యంగా హైదర్గూడ జనప్రియా అపార్టుమెంట్ వద్ద నుంచి లక్ష్మీనగర్ వెళ్లే రహదారిలో చెత్తకుండిపక్కన బయోటాయిలెట్లను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో అది నిరూపయోగంగా మారింది.
హైదర్గూడ జనప్రియా చౌరస్తా వద్ద ఉన్న బయో టాయిలెట్ బయట ఏర్పా టు చేసిన వాష్బేససిన్ పగిలి, లోపల అంత చెత్త చేరి వీధి కుక్కలకు నిలయంగా మారింది. దీంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదని, శానిటేషన్ అధికారులకు చెబితే తమకు సంబంధం లేదని చెబుతున్నారని డివిజన్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు చర్యలు తీసుకుని బయో టాయిలెట్ల నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని అత్తాపూర్ డివిజన్ ప్రజలు కోరుతున్నారు.