హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): చారిత్రక జహంగీర్‌పీర్ దర్గా, మౌలాలి, పహాడీషరీఫ్ దర్గాలు, మక్కామసీదులో కొనసాగుతున్న అభివృద్ధి, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. నగరంలో శనివారం సుమారు 4 గంటల పాటు ఈ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జేపీ దర్గా అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. భూసేకరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని, సంబంధిత వ్యాపారులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. నగరంలో వక్ఫ్‌బోర్డుకు చెందిన 11 విలువైన ఆస్తులను ఈ-టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి నదీం అహ్మద్, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లీ పాల్గొన్నారు.