మాదాపూర్, ఆగస్టు 28: పుట్టిన రోజు వేడుకల్లో తెలంగాణ డిఫెన్స్ క్యాంటిన్‌కు చెందిన 32 మద్యం బాటిళ్లు సరఫరా చేసిన బ్యాంకెట్ హాల్ మేనేజర్‌పై సోమవారం ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. శేరిలింగంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మణ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా అడవిపాలెంకు చెందిన జి.వెంకట్ రావు (40) వ్యాపార నిమిత్తం వచ్చి.. మదీనాగూడలోని జీఎస్ఎం మాల్ వద్ద నివాసముంటున్నాడు. అక్కడే ఉన్న జీఎస్ఎం మాల్లోని మధురా బ్యాంకెట్ హాల్‌ను కొన్ని నెలల కిందట లీజుకు తీసుకున్నాడు. స్థానికంగా నివాసముంటున్న ఓవ్యక్తి ఈ నెల 27న తన పుట్టిన రోజు వేడుకల కోసం మధురా బ్యాంకెట్ హాల్‌ను బుక్ చేసుకున్నాడు. ఈవెంట్ నిమిత్తం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రూ. 12 వేలు చలాన కూడా చెల్లించి అనుమతి తీసుకున్నాడు. మధుర బ్యాంకెట్ హాల్ మేనేజర్ అత్యుత్సాహం ప్రదర్శించి.. తెలంగాణ డిఫెన్స్ క్యాంటీన్‌కు చెందిన 32 బాటిళ్లను బ్లాక్‌లో సరఫరా చేశాడు. 27న రాత్రి 9:45 గంటల సమయంలో శేరిలింగంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో శంషాబాద్ డీటీఎఫ్ (డిస్ట్రిక్ టాస్క్‌ఫోర్స్) ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్ కుమార్, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా.. 32 డిఫెన్స్ మద్యం బాటిళ్ల బయటపడ్డాయి. మధురా బ్యాంకెట్త హాల్ మేనేజర్ వెంకట్ రావుపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 32 మద్యం బాటిళ్ల విలువ రూ. 1.28 లక్షలు ఉంటుందని తెలిపారు.