సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎక్కడ చూసినా 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే అనే మాట వినిపిస్తోంది… అయితే బుక్ రూమ్ అనేది ఒకటి ఉండాలని నా బలమైన కోరిక అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం క్రెడాయ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్టమొదటి టీఎస్ క్లాన్క్లేవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానిది కీలక పాత్ర అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో బిల్డర్లు తమ వంతు పాత్రలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించేందుకు బిల్డర్లు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 15 చాప్టర్లుగా ఉన్న క్రెడాయ్, 20 చాప్టర్ల వరకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కొవిడ్ సమయంలో బిల్డర్లు చేసిన సేవా కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. సమావేశంలో క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షులు గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షులు ఎలక్డ్ ఈ.ప్రేమ్‌సాగర్ రెడ్డి, కార్యదర్శి కె.ఇంద్రసేనారెడ్డి, పాండు రంగారెడ్డితో 15 చాప్టర్లకు చెందిన బిల్డర్లు, డెవలపర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఎస్ క్లాన్క్లేవ్ టైటిట్ స్పానర్స్గా రాధా టీఎంటీ సంస్థ వ్యవహరించింది.
చాలా మంది ఔత్సాహికులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్ లైస్సెస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల కోసం పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసింది. ఇలా ఎక్కువ రంగాల్లో పెట్టుబడులు తెలంగాణకు రావడం వల్ల ఇక్కడ ఆఫీసు స్థలాలకు, నివాస గృహాలకు మంచి డిమాండు నెలకొంటుందని, ఈ విషయాన్ని బిల్డర్లు గుర్తించాలి.
రియల్ ఎస్టేట్ రంగంలో సంస్కరణలు తీసుకురావడంలో తెలంగాణ రాష్ట్ర ముందుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి సింగిల్ విండో ప్రాసెస్ అయిన టీఎస్ బీపాస్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం సమగ్రమైన భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ అయిన ధరణిని అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మంచి డిమాండు నెలకొందన్నారు. టీఎస్ క్లాన్క్లేవ్-2021ను క్రెడాయ్ సభ్యులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త సభ్యులందరికీ ఉపయోగపడేలా రూపొందించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి. అపారమైన ప్రతిభావంతుల లభ్యత, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్కృతి దేశ వ్యాప్తంగా ఉద్యోగులకు తెలంగాణకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మారింది. దీనికి తోడు ప్రభావవంతమైన లా అండ్ ఆర్డర్, నాణ్యమైన ఆరోగ్య రక్షణ, చక్కటి జీవన ప్రమాణాలతో కూడిన ఆవాసాలు ఉన్నాయి. ఇవన్నీ అనుకూలతలు రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాయి.