ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 24: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీస్ శాఖ నడుం బిగించింది. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో అధికంగా యువత, విద్యార్థులే ఉంటుండటంతో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నది. డ్రగ్స్‌తో కలిగే దుష్ఫలితాలను వివరిస్తున్నది. ఇందులోభాగంగా ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద డ్రగ్స్ అవేర్నెస్ వాక్‌ను నగర పోలీసులు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ సాధనలో ఓయూ విద్యార్థుల పాత్ర ఎనలేనిదని.. ఓయూ విద్యార్థులను రాష్ట్రమంతా ఆదర్శంగా తీసుకుంటుందని.. అందుకే ఓయూలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దేశానికే వెన్నెముక లాంటి యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారవద్దన్నారు.
ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యవసనాలు తెలియకనే అనేకమంది మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ రమేశ్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీలు ఆకుల శ్రీనివాస్, వెంకటరమణ, సీఐ రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.