సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): స్టేట్ డేటా సెంటర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా జలమండలి ఆన్లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో తాజా పరిస్థితులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో శుక్రవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ట్యాంకర్ బుకింగ్, డెలవరీ, ఎంసీసీ ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజలకు అసౌకర్యం కాకుండా ఎమర్జెన్సీ కంటింజెన్సీ ప్లాన్‌ను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ట్యాంకర్ బుకింగ్, డెలివరీలు మ్యానువల్‌గా క్షేత్రస్థాయి సిబ్బందితో చేపట్టాలన్నారు. వాటికి సంబంధించిన వివరాలు పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఎంసీసీకి వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి పరిష్కరించడానికి మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.