సిటీబ్యూరో, జనవరి 5(నమస్తే తెలంగాణ) : వినికిడి సమస్య ఉన్న రోగుల పాలిట వరంగా మారిన కాక్లియర్ ఇంప్లాంట్ విజయవంతమైన ఫలితాలు ఇస్తున్నాయని, ఈ క్రమంలో వినికిడి లోపం ఉన్న ఎంతో మంది బాధితులు తమ సమస్యను అంగవైకల్యంగా భావించి మానసికంగా బాధపడకుండా సాధారణ వ్యక్తుల్లానే ప్రభుత్వ రంగంలోని ఉన్నత స్థాయి ఉద్యోగాలను సైతం అధిరోహిస్తున్నట్లు అపోలో హాస్పిటల్ ఈఎన్టీ వైద్యనిపుణులు డాక్టర్ ఈ.సీ.వినయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు దవాఖానలో 2500కాక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించామని, అందులో 9నెలల శిశువు నుంచి 87ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నట్లు తెలిపారు.
అపోలో కాక్లియర్ ఇంప్లాంట్ క్లినిక్ ఒకే రోజు 18 సర్జరీలు చేసి, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నదని గుర్తుచేశారు. వినికిడి లోపాన్ని అంగవైకల్యంగా భావించి మానసిక వత్తిడికి గురికానవసరం లేదన్నారు. డా. శ్రీకాంత్ మాట్లాడుతూ సాధారణ వ్యక్తులు 40నుంచి 60డెసిబుల్ శబ్దాన్ని వినగలుగుతారని, వినికిడి లోపం ఉన్న వారు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తరువాత 25డెసిబుల్లోపు శబ్దాన్ని వినగలుగుతారన్నారు.
ఒక వ్యక్తి శబ్దాన్ని వినేందుకు 25డెసిబుల్ను ప్రామాణికంగా తీసుకోవచ్చని, కాక్లియర్ ఇంప్లాంట్ వల్ల ఇది సాధ్యమవుతుందన్నారు. అపోలో దవాఖానలో కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకున్న వారిలో కొంత మంది ప్రభుత్వ రంగంలోని ఉన్నత స్థాయి ఉద్యోగాలను అధిరోహించారని, వారితో పాటు కొంత మంది క్రీడల్లో కూడా రానిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే డెఫ్ నేషనల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఎస్.సాయిచందన్ అనే క్రీడాకారుడు జాతీయ స్థాయిలో 5వ స్థానం, ప్రపంచ స్థాయిలో 7వ స్థానాన్ని సాధించారన్నారు. అంతేకాకుండా 9వ తరగతి చదువుతున్న యశ్వంత్‌రెడ్డి ప్రముఖ యూట్యూబర్‌గా, అనూష అపోలో దవాఖానలోనే ఆడియాలజిస్ట్గా సాధారణ వ్యక్తుల్లానే విజయాలను అధిరోహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యనిపుణులు, కాక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించుకుని వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు పాల్గొన్నారు.