కీసర, జనవరి 29: దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలం కరీంగూడలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, సీసీ రోడ్డులను శనివారం జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం దళితబంధు సర్వేలో పాల్గొని దళితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధు పథకానికి మొదటి విడతలో కరీంగూడను ఎంపిక చేశామని, వచ్చేనెల 10వ తేదీలోగా 10 మంది దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 20 మంది చొప్పున మొత్తం 100 మందిని దళితబంధు లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామన్నారు. జిల్లాలోని అయిదు నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలెక్టరేట్లో దళితబంధు మీద రివ్యూ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, కరీంగూడ సర్పంచ్ కౌకుట్ల గోపాల్‌రెడ్డి, కీసర ఎంపీడీవో పద్మావతి, ఎంపీటీసీ మంచాల కిరణ్‌జ్యోతి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఆకిటి మహేందర్‌రెడ్డి, మోర విమలనాగరాజు, గరుగుల ఆండాలుమల్లేశ్లతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నేతలు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, సింగారం నారాయణ, వంగేటి పర్వత్‌రెడ్డి, గరుగుల మల్లేశ్, మోర నాగరాజు, సింగల్‌విండో డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.