మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 08, 2020 , 00:00:01

చేతులెత్తి మొక్కుదాం

చేతులెత్తి మొక్కుదాం

  • ప్రాణ భయమున్నా విధుల నిర్వహణ 
  • వైరస్‌ కట్టడి కోసం అలుపెరుగని శ్రమ 
  • సీఎం నగదు ప్రోత్సాహంతో కార్మికుల్లో రెట్టింపైన మనోధైర్యం

సూర్యోదయం కాకముందే.. నగరం నిద్ర మేల్కోకముందే..  పారిశుధ్య కార్మికులు విధుల్లో నిమగ్నమవుతారు. పండుగొచ్చినా, ప్రకృతి విపత్తు సంభవించినా సైనికుల్లా కర్తవ్య నిర్వహణలో భాగమవుతారు. ఇప్పుడు కరోనా వైరస్‌తో ప్రాణ భయమున్నా..నిబ్బరంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ముందుండి పోరాటం చేస్తున్నారు.. లాక్‌డౌన్‌తో అందరూ ఇండ్లకే పరిమితమైనా.. నగరవాసులను సురక్షితంగా ఉంచడంలో తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇంతటి గొప్పవాళ్లను మనం ఎంత పొగిడినా.. తక్కువే... ఈ త్యాగధనులకు రెండు చేతులెత్తి మొక్కాల్సిందే.           

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: నగర వైశాల్యం సుమారు 625 చదరపు కిలోమీటర్లు.. దాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు 22,500 మంది కార్మికులు శ్రమిస్తున్నారు. అలాగే, 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్తను సేకరించి ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు చేరిస్తే అక్కడి నుంచి డంపింగ్‌యార్డుకు పంపిస్తుంటారు. ఇప్పుడు కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తుండడంతో పారిశుధ్య కార్మికుల బాధ్యతలు మరింతగా పెరిగాయి. గతంలో రోజువారీగా రోడ్లు శుభ్రం చేస్తే సరిపోయేది. ఇప్పుడు కరోనా కేసులు నమోదైన  గృహాలు, హోం క్వారంటైన్‌ చేసిన గృహాలు, ప్రభుత్వ దవాఖానలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధతో స్వీపింగ్‌ పనులు నిర్వహించాల్సి వస్తున్నది. ప్రమాదం పొంచి ఉన్నా...అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల విధులకు ఆటంకం కలుగుకుండా బల్దియా ఆర్టీసీ సహకారంతో 28 రూట్లలో 35 ప్రత్యేక బస్సులు నడిపుతున్నది. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లను వారికి అందిస్తున్నది.  దాదాపు 7,500 లీటర్ల శానిటైజర్‌ను కార్మికుల కోసం సర్కిళ్ల వారీగా సిద్ధం చేశారు. 

క్రిమి సంహారక విధుల్లో కీలకంగా....

 జీహెచ్‌ఎంసీలో మరో 2,375 మంది కార్మికులు ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. స్వతహాగా వీధుల్లో ఫాగింగ్‌ చేయడం, నీరు నిలిచిన ప్రాంతాలు, చెరువులు, గుంతల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించడం, ఇండ్లలో దోమల మందు పిచికారీ చేయడం వీరి విధి. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినప్పటి నుంచి వీరి విధులు పూర్తిగా మారిపోయాయి. మూడు షిఫ్టులుగా విధులు నిర్వహిస్తున్నారు.

పరిశుభ్రంగా ఉంచడంలో... 

ప్రకృతి పరంగా ఎక్కడ ఎటువంటి ప్రమాదం సంభవించినా, ఇండ్లు కూలినా, గోడలు కూలినా వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టే డీఆర్‌ఎఫ్‌కి చెందిన 1,100 మంది సేవలు కూడా ప్రస్తుత కరోనా నిరోధక చర్యల్లో విరివిగా ఉపయోగపడుతున్నాయి. జెట్టింగ్‌ యంత్రాలు, వాటర్‌ ట్యాంకుల్లో క్రిమి సంహారక రసాయనాలు నింపుకొని రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలలు తదితర వాటిల్లో పిచికారీ చేస్తున్నారు.  వివిధ విభాగాల్లో కార్మికులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో శ్రమిస్తున్నారు.

25,294 మందికి లబ్ధి 

పారిశుధ్య కార్మికులు  పడుతున్న శ్రమకు గుర్తింపుగా సీఎం కేసీఆర్‌..  నగదు ప్రోత్సాహం ప్రకటించడంతో కార్మికుల్లో మనోధైర్యం రెట్టింపైంది. సీఎం దయా హృదయుడని, తమ జీవితాల్లో వెలుగులు నింపారని,  ఆయనకు రుణపడి ఉంటామని కొనియాడుతున్నారు.  కాగా, నగదు ప్రోత్సాహంతో మొత్తం 25,924 మందికి లబ్ధి చేకూరనుంది. పారిశుధ్య విభాగానికి చెందిన 19,270 మంది ఔట్‌ సోర్సింగ్‌ , 2,685 మంది శాశ్వత ఉద్యోగులు, 2,487 మంది ఎంటమాలజీ, 550 ఈవీడీఎం, 302  మంది వెటర్నరీ సిబ్బందికి సాధారణ నెలవేతనంతో పాటు 7,500 అదనపు ప్రోత్సాహకం లభించనున్నది. కాగా, శంషాబాద్‌ మండలం పాలమాకుల సర్పంచ్‌ సుష్మ సంవత్సరం వేతనాన్ని పంచాయతీ కార్మికులకు విరాళంగా అందజేస్తున్నట్లు  ప్రకటించారు.

నమస్కరించి... 


మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నాతో పాటు మన ప్రభుత్వం, యావత్తు తెలంగాణ సమాజం మీకు అండగా ఉం టుంది. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా ధైర్యంగా ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తున్నా.’ అని పాజిటివ్‌ కేసు నమోదైన తుర్కపల్లి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లతో మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. తుర్కపల్లి గ్రా మంలో మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి వీధులన్నీ తిరిగారు. వైద్య, శానిటేషన్‌ సిబ్బందిలో ధైర్యం నింపారు. 

పారిశుధ్య కార్మికుల కృషి అమూల్యమైంది

  • మేయర్‌ రామ్మోహన్‌

కరోనా కట్టడికి పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి అమూల్యమైనదని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదనంగా రూ.7500 కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుధ్య, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్‌ తదితర విభాగాలు సంయుక్తంగా సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశాయి. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ గతంలో వ్యాధులు ప్రబలినప్పటికీ వాటిని ధైర్యంతో విజయవంతంగా ఎదుర్కొన్న చరిత్ర జీహెచ్‌ఎంసీ కార్మికులదేనన్నారు. 

దయాగుణం..

 ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు ఎంతో దయగల్ల మనిషి. కరోనా వైరస్‌ ఇబ్బందులున్నా మంచిగా పని చేస్తున్నామని మమ్మల్ని గుర్తించారు. మా కష్టానికి ఫలితం దక్కింది. మాకు నగదు ఇస్తామని ప్రకటించడంతో ఎంతో సంతోషంగా ఉంది. మరింత ఉత్సాహంగా పనిచేస్తాం.

- పద్మ, పారిశుధ్య కార్మికురాలు 

కష్టం తెలిసిన మనిషి..

మా కష్టం తెలిసిన మనిషి సీఎం కేసీఆర్‌. మమ్మల్ని కడుపుల పెట్టుకుని చూస్కుంటడు. బేఫికర్‌. తొందర్గనే పరిస్థితులు చక్కబడతయ్‌. మాకు రూ.7,500ల నజరానా ఇచ్చిన తీరు.. మా గురించి మాట్లాడిన మాటలు.. సీఎంకు మా కార్మికుల మీద ఉన్న అభిమానం ఎట్లాంటిదో తెలుస్తున్నది. 

- దినేష్‌, పారిశుధ్య కార్మికుడు లింగయ్యనగర్‌

సీఎం సార్‌కు దండాలు

పారిశుధ్య విభాగంలో కార్మికురాలిగా పదేండ్ల నుంచి పని చేస్తున్న. మమ్ముల్ని , మా కష్టాన్ని గుర్తించింది మొదటి సీఎం కేసీఆర్‌ సారే. మా కష్టాన్ని చూసి మా గురించి గొప్పగా చెప్పిన సీఎం సార్‌కు దండాలు. ప్రోత్సాహంగా అదనంగా జీతం డబ్బులు కూడా ప్రకటించి మాకు దేవుడయ్యారు.

 - మల్లెపు వెంకటమ్మ, పారిశుధ్య కార్మికురాలు

సేవకు ప్రతిఫలం..

లాక్‌డౌన్‌ ఉన్న కూడా విధుల్లో ఉంటూ కాలనీలను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించారు. సమాజానికి మేం అందిస్తున్న సేవకు తగిన ప్రతిఫలం లభించింది.

 - వెంకటమ్మ, కార్మికురాలు 


logo