సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేసి.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలు చోట్ల క్రీస్తు జన్మవృత్తాంతంపై నాటికలు, గీతాల ఆలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు విభిన్న సామాజిక కార్యక్రమాలతో సేవా స్ఫూర్తిని చాటుకుంటున్న టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో నిరుపేద చిన్నారులకు గిఫ్ట్‌లను అందజేశారు. శాంటా వేషధారణలో వీటిని అందించి వారి మోములో చిరునవ్వులు పూయించారు.
శాంటా వేషధారణతో గిఫ్ట్‌లు పంపిణీ
చిన్నారుల ముఖంలో చిరునవ్వులు పూయించడానికి విభిన్న రకాల సామాజిక కార్యక్రమాలతో అండగా నిలుస్తున్న ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ క్రిస్మస్ సందర్భంగా మరో కార్యక్రమం చేపట్టి చిన్నారుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. పండుగ రోజు వారికి నచ్చిన బహుమతులను అందించిన ఫౌండేషన్ సభ్యులు ఆశ్చర్యపరిచారు. సీక్రెట్ శాంటా వేషధారణలో టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు రీనా హిండొక, విభూతి జైన్ నగరంలోని పలు స్లమ్ ప్రాంతాల్లో పర్యటించి చిన్నారులకు క్రిస్మస్ బహుమతులు అందజేశారు. వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు అకస్మాత్తుగా చేతుల్లో గిఫ్ట్ పెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్‌లు అందుకున్న చిన్నారులు సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. కృతజ్ఞతలు చెబుతూ మురిసిపోయారు. క్రిస్మస్ పురస్కరించుకుని ఫౌండేషన్ సభ్యులు సుమారు 200 మంది చిన్నారులకు బహుమతులు అందించారని రీనా తెలిపారు.